ఎండిపోతున్న పంటలు..!


Published Feb 14, 2025 01:25:57 PM
postImages/2025-02-14/1739519757_ap211023main15a.jpg

ఎండిపోతున్న పంటలు

ఆగమైతున్న అన్నదాతలు..!

 

 

మనోవేదనతో పురుగుల మందుతాగిన రైతు

సాగునీరు కోసం ఆందోళన

నీటిని విడుదల చేయాలంటూ మోకాళ్ల ర్యాలీ

రెండు రోజుల్లో విడుదల చేయాలని డిమాండ్

లేకపోతే గాంధీభవన్ ముట్టడిస్తామని హెచ్చరిక

సర్కార్‌కు అల్టిమేటం జారీ చేసిన సూర్యాపేట రైతులు

 

 రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటలను బతికించుకునే మరో దారిలేక ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రైతులు నిరసనల బాటపడుతున్నారు. తక్షణం తమకు నీళ్లు విడుదల చేయాలని లేదంటే నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. తమ పంటలకు నీళ్లు రాకపోతే ఛలో గాంధీభవన్ చేపడతామని రేవంత్ సర్కార్‌కు అల్టిమేటం జారీ చేస్తున్నారు.

 

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 13): రాష్ట్ర రైతాంగం సాగునీటి కష్టాలను ఎదుర్కొంటోంది. పంటలు ఎండిపోతున్నా నీళ్లు విడుదల చేయకపోవడంతో సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు కూడా అడుగంటడంతో పంటలకు నీరు అందించలేకపోతున్నారు. రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేస్తే సాగు చేసుకోవచ్చని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో సాగునీరు అందక యాతన పడుతున్నారు. తమను పట్టించుకునే వారు కరువయ్యారని కుడకుడ, చిన్నగారకుంట తాండ, పెద్దగారకుంట తాండ రైతుల ఆవేదన చెందుతున్నారు.

 

కన్నీరు పెట్టించే దృశ్యం

 

ఎంతో శ్రమించి కన్నబిడ్డలా పంటలను కాపాడుకుంటున్న రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందించలేని సర్కార్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏకంగా ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతున్నారు. సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామానికి చెందిన వేములకొండ లక్ష్మయ్య అనే రైతు పంటభూమిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు వెంటనే గమనించి ఆస్పత్రికి తరలించారు. సాగునీరు లేక ఎండిపోతున్న పంటను చూసి, మనోవేదనతో ఆత్మహత్యకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు.

 

ఇదిలా ఉంటే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చిన్నగారకుంట తాండ, పెద్దగారకుంట తాండ రైతులు మోకాళ్లపై కూర్చొని ఆందోళనకు దిగారు.  SRSP కాలువ ద్వారా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు విడుదల చేయాలని, లేకపోతే 3000 మంది రైతులతో గాంధీ భవన్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy telanganam farmers government

Related Articles