మాటలు ఫుల్
చేతలు నిల్
ఆరోపణలకే పరిమితం అవుతున్న బీజేపీ
ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన ఆరోపణలు
మళ్లీ ఇప్పటి వరకు దాని ఊసే లేదు
బీజేపీ పెద్దల సూచనతోనే సైలెంట్ అయ్యారా?
మీడియా అటెన్షన్ కోసమేనా ఆరోపణలు
సంచలనం కోసమేనా విమర్శలు
రేవంత్ సర్కార్‌పై గాండ్రింపులు?
ప్రజలను మభ్య పెట్టేందుకేనా ఈ మాటలు
ప్రజల్లోకి తీసుకెళ్తాం.. పోరాడుతాం.. ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. బీజేపీ నేతలు చెప్పే మాటలివి. ఎనకటికి ఒకాయన లేస్తే మనిషిని కాదు అనేవాడట. రాష్ట్ర బీజేపీ నేతల తీరు కూడా అలాగే ఉంది. మీడియా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై రంకెలు వేసే నాయకులు.. కాగితం పులులుగా మాత్రమే మిగిలిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసే కమలం నేతలు.. ఆ తర్వాత తెరమరుగవుతున్నారు. రాష్ట్ర నాయకుల్లో ఈ ద్వంద్వ వైఖరికి కారణం ఏంటి? వాళ్లలో మార్పునకు మూలం ఏంటి? బీజేపీ పెద్దల సూచనలతో సైలెంట్ అవుతున్నారా లేక ప్రభుత్వ పెద్దలతో లోపాయికారి ఒప్పందాలా? అసలు కమలం పార్టీలో ఏం జరుగుతోంది? వారి మౌనం వెనక ఉన్నది ఎవరు?
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 14): రాష్ట్ర బీజేపీలో అందరూ ఉద్దండులే. ఒక్కో నాయకుడిది ఒక్కో ప్రత్యేకత. తమకంటూ సొంత కేడర్, రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్న నేతలే. రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారే. ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తిచూపేవారే. పక్కా ఆధారాలు ఉన్నాయంటూ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా చేస్తుంటారు. కానీ, అది ఆరోజుకు మాత్రమే పరిమితం అవుతుంది. తర్వాత ఎక్కడా దాని ఊసే ఉండదు. కాంగ్రెస్ అవినీతిలో కూరుపోయిందని విమర్శలు చేస్తారు.. ఆ తర్వాత రెండు రోజులకు మొత్తం సైలెంట్ అయిపోతారు. ఏమవుతుందో ఏమోకానీ, మళ్లీ ఎక్కడా కనిపించరు. బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ కోవకు చెందినవారే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అనేక ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పటి వరకు వాటిపై పూర్తిస్థాయిలో కార్యాచరణకు దిగిందిలేదు.
గత నెలలో రెండు, మూడు రోజుల్లో మంత్రుల అవినీతిని బయటపెడతానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ఆధారాలు లేకుండా తాను మాట్లాడినట్టు చరిత్రలో లేదని కూడా అన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నాడు బీజేపీ పోరాటం చేసిందని, నేడు కాంగ్రెస్‌పై కూడా అదే తరహా పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, ఇప్పటి వరకు పత్తా లేరు ఆయన. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ప్రధానితో కుటుంబ సమేతంగా ఫోటోలు కూడా దిగారు. కానీ, శాఖలలోని అవినీతిని మాత్రం ఇప్పటి వరకు వెలికి తీసింది లేదు. దీంతో ఏలేటి కేవలం మాటలకే పరిమితం అయ్యారన్న చర్చ మొదలైంది. బీజేపీ పెద్దల హెచ్చరికలతోనే ఆయన మౌనంగా ఉన్నారని, రేవంత్ సర్కార్‌పై ఆ తర్వాత నుంచి ఆయన ఎలాంటి ఆరోపణలు చేయడం లేదన్నది టాక్. సర్కార్‌తో లోపాయికారి ఒప్పందాలతోనే బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ చీకటి స్నేహం కారణంగానే మీడియా ముందు గాండ్రింపులు, తెరవెనక దోస్తీలు అన్న విమర్శలు ఉన్నాయి.
హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సివిల్ సప్లై అక్రమాలపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పౌరసరఫరాల శాఖలో అవినీతి జరుగుతుందంటూ రాష్ట్రంలో మొదటిసారి గళం విప్పింది కూడా ఆయనే. సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లలోనూ గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు. అయితే ఏలేటి ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తాం.. పోరాడతాం.. ప్రభుత్వాన్ని నిలదీస్తాం అనే ఆయన మాటలు కూడా ఉత్తముచ్చట్లే అవుతున్నాయి. బీజేపీ శాసన సభాపక్షనేతగా అసెంబ్లీలో సర్కార్‌పై నిప్పులు చెరిగే ఆయన.. కేవలం మీడియా అటెన్షన్ కోసం మాత్రమే చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నిజంగా నిలదీయాలన్న ఆలోచన ఆయనకు లేదన్న చర్చ జరుగుతోంది.