ఈ నెల 19న తెలంగాణ భవన్‌కు కేసీఆర్
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి భేటీ
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు..
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
తెలంగాణం, హైదరాబాద్ (ఫిబ్రవరి 13) : ఈనెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. దీంతో ఈనెల 19న మధ్యాహ్నం 1 గంట నుండి హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత , మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ తెలిపారు.
ఈ నెల 19 న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ ఏటా అడుగు పెడుతుండటంతో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చించనునట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణ సిద్దం చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటీఆర్ తెలిపారు.