సీఎం రేవంత్ ఇలాఖాలో.. తాగునీటి కష్టాలు


Published Feb 14, 2025 01:39:16 PM
postImages/2025-02-14/1739520556_WhatsAppImage20250214at1.33.48PM.jpeg

సీఎం రేవంత్ ఇలాఖాలో..

తాగునీటి కష్టాలు

 

కొడంగల్ లో మంచినీళ్ల బాధలు

టేకులకోడులో 25 రోజులుగా రాని నీళ్లు

ఖాళీ బిందెలతో మహిళల నిరసనలు

ఇదేం పరిస్థితి అంటూ హరీష్ రావు అసహనం

 

‘‘ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే తాగు నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క నానా యాతన పడుతున్నారు. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 25 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలానికి ముందే నీటి బాధలు మొదలుకావడంతో ఖాళీ బిందెలతో రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు.’’

 

తెలంగాణం, హైదరాబాద్ (ఫిబ్రవరి 13): వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని టేకులకోడు గ్రామంలో గత 25 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  నీటి కోసం పొలాల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన  వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నీటి సమస్య ఉందని అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లుగా తమ సమస్యను పరిష్కరిస్తారని ఎదురు చూసినా ఎలాంటి ఫలితం లేదని మండిపడ్డారు. దీంతో గురువారం రోజున గ్రామంలోని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్ ఎక్కి ధర్నాకు దిగారు.  పంచాయతీ సెక్రెటరీ వెంటనే రావాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 

25 రోజులుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. బిందెడు నీటి కోసం ఎన్నో కష్టాలు పడుతూ బావుల వరకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. అసలే ఎండలు కొడుతుంటే అంతా దూరం నుంచి తెచ్చుకోవడం కష్టంగా ఉందన్నారు. వృద్ధుల బాధలు చెప్పుకోలేకుండా ఉందని అంటున్నారు. దూరం వెళ్లి తెచ్చుకోలేక, తాగేందుకు నీళ్లు లేక పడరాని పాట్లు పడాల్సి వస్తుందన్నారు. ఎండాకాలం మొదలుకాక ముందే  పరిస్థితులు ఇలా ఉంటే రానురాను పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పుడే ఇలా ఉంటే ఎలా: హరీష్ రావు

 

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ప్రజలు తాగు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారనివేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారనీ, కనీసం తాగు నీటి కొరత అయినా లేకుండా చూడండి అంటూ రేవంత్ రెడ్డికి సూచించారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress telanganam kodangal

Related Articles