చట్టసభల్లో హుందాతనం లేదు!
ఎన్ని తిట్లు తిట్టావ్.. ఎంత చండాలంగా మాట్లాడావనే పోటీ
రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే..
టీవీ ఛానల్స్ మార్చమనే దుస్థితి నేడు!
దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ సభలో సీఎం
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 14): చట్టసభల హుందాతనంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో దేవేందర్ గౌడ్ రాసిన ‘విజయ తెలంగాణ’ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్నట్టు చట్ట సభల్లో హుందాతనం ఈరోజు తెలంగాణలో లేదని, ఈరోజు చట్ట సభల్లో మాట్లాడేవాళ్ళుకు ఎన్ని తిట్లు తిట్టావు, ఎంత చెడ్డగా తిట్టావు, ఎంత చండాలంగా మాట్లాడావనే పోటీ జరుగుతుందన్నారు. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే చిన్న పిల్లలను టీవీ ఛానెల్స్ మార్చమనే దుస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేగాక తన భాషపై వచ్చే విమర్శలపై కూడా స్పందించారు. ఈ ఆటలో తాను వెనకబడితే అవుట్ అవుతానని అందుకే మాట్లాడాల్సి వస్తుందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, సీఎంతో సమానమైన అధికారాన్ని వదులుకుని తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ ముందుకొచ్చారని గుర్తుచేశారు. టీజీని మొదటగా దేవేందర్‌గౌడ్ నిర్ణయించారని, అందుకే తాము అధికారంలోకి వచ్చాక టీజీనే ఉండాలని అమలుచేశామని చెప్పారు.