రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
రాహుల్ టీమ్‌లో కీలక నేతగా గుర్తింపు
మీనాక్షి ఎంపికపై పీసీసీ చీఫ్ హర్షం
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 14): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీ టీంలో కీలక నేతగా మీనాక్షి నటరాజన్‌కు గుర్తింపు ఉంది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మీనాక్షి త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మీనాక్షి రాకతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్ అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత పదవులను అందుకున్న నాయకురాలు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్‌లలోని పలు హోదాల్లో పని చేసిన మీనాక్షి నటరాజన్.. ఏఐసీసీలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ మంద్‌సౌర్ నుంచి పోటీ చేసిన మీనాక్షి.. ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. కానీ.. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. రచయిత్రిగాను తనకు గుర్తింపు ఉంది.
మీనాక్షి నటరాజన్ నియామకం పట్ల పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకం మంచి పరిణామం అన్నారు. అత్యంత నిజాయితీ గల నేతగా, అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికి ఆదర్శంగా ఉండే నాయకురాలుగా గుర్తింపు పొందారని తన ప్రకటనలో పేర్కొన్నారు. 1999 -2000 సంవత్సరంలో మీనాక్షి నటరాజన్ జాతీయ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో తాను రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులుగా పనిచేసే అవకాశం కలిగిందన్నారు. తెలంగాణలో భూదాన్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఎంతో ఉత్తేజ పరిచారన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇంచార్జ్‌గా పని చేసిన దీపాదాస్ మున్షికి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు.