ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ వ్యవస్థను మొదలుపెట్టారు. కానీ తన ఇంటివాళ్ల కోసం దాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ వ్యవస్థను మొదలుపెట్టారు. కానీ తన ఇంటివాళ్ల కోసం దాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా పేరుతో అనేక కట్టడాలు కూల్చివేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, ఒకరిద్దరు బడా నేతల ఇళ్లను నేల మట్టం చేశారు. అంతేకాదు.. పేదల ఇళ్లపైనా బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. వారికి నిలువనీడ లేకుండా చేశారు. ఇంట్లో పాలు తాగే చిన్నపిల్లలు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇళ్లు కూల్చి.. వాళ్లను బజార్లో పడేశారు. హైడ్రాకు అందరు ఒక్కటే అని..స్వయంగా ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు.
కానీ తీరా తన దగ్గరకు వచ్చే వరకు వ్యవహారం మొత్తం మారిపోయిందట. అన్న తిరుపతిరెడ్డి కోసం ఏకంగా హైడ్రాకు బ్రేకులు వేశారనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లో ఉందని బయటపడింది. అందరి ఇండ్లు వెంటనే కూల్చిన అధికారులు ఆయనకు మాత్రం నోటీసు ఇచ్చారు. అయితే.. నోటీసులు ఇచ్చి వదిలేయాలని ప్రభుత్వ పెద్దల నుంచే అధికారులకు ఆదేశాలు వచ్చాయట. దీంతో నెల క్రితం అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. నెల రోజుల్లోగా స్వయంగా తానే ఇళ్లు కూల్చుకోవాలని, లేదంటే తామే కూలుస్తామని నోటీసులు చెప్పారట.
అంతా ముందే సెటిల్ అవ్వడంతో.. ఇప్పుడు అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. దీంతో అట్టహాసంగా తీసుకొచ్చిన హైడ్రాను అన్నకోసం ఆగం చేశారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. సొంత పార్టీలోనూ ఇదే మాట వినిపిస్తోంది. మొదట్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లను కూల్చుతామన్న రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత మాట మార్చారు. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లను కూల్చబోమని, కొత్తగా నిర్మించుకునే ఇళ్లను అడ్డుకుంటామని చిట్ చిట్ లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు నిరుపేదలకు చెందిన వందలాది ఇళ్లను నేల మట్టం చేసి... తన అన్న తిరుపతిరెడ్డి ఇంటి వ్యవహారం వచ్చే సరికి రూల్స్ ని కూడా మార్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ వ్యవహారంపై అటూ పేదలతో పాటు పార్టీ నేతలు కూడా గుర్రు మీదున్నారట. మొదట్లో ఎవరితో చర్చించకుండా దూకుడుగా వెళ్లడం ఎందుకు..? ఇలా యవ్వారం మన దగ్గరకు వచ్చే సరికి దోశ తిరగేసినట్టు.. మాట మార్చడం ఎందుకని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఆయన నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మదనపడుతున్నారట. అంతేకాదు అప్పట్లో వసూళ్ల కోసమే హైడ్రాను తీసుకొచ్చారన్న ఆరోపణలు కూడా.. ఈ పనితో నిజమని దీంతో తెలిపోయిందనే ప్రచారం కూడా మొదలైంది.