ముమ్మాటికీ మిగులు బడ్జెట్ రాష్ట్రమే..!


Published Feb 17, 2025 11:48:22 AM
postImages/2025-02-17/1739773102_WhatsAppImage20250217at11.07.58AM1.jpeg

ముమ్మాటికీ మిగులు బడ్జెట్ రాష్ట్రమే
మీరా అప్పుల గురించి మాట్లాడేది
పదేళ్ల పాలనలో అగ్రస్థానంలో తెలంగాణ
కేంద్రం చేసిన అప్పులతో ఏం చేసిందో చెప్పాలి?
బీజేపీ ఎంపీలు చేసింది సున్నా
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం దారుణం
బీజేపీ తప్పులను ఎన్నటికీ తెలంగాణ ప్రజలు క్షమించరు
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ

 తెలంగాణం, హైదరాబాద్ (ఫిబ్రవరి 16) : బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో అప్పులు మిగిలాయన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ఆదివారం స్పందించారు. ఈ మేరకు ఆమెకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజల దశాబ్దాల కష్టాలను తీర్చామన్నారు. తెలంగాణ దశ, దిశను మార్చి రాష్ట్రానికి తరగని ఆస్తులు సృష్టించామ‌న్నారు. ‘‘దేశ చరిత్రలో అత్యధిక అప్పులు చేసిన మీరా మమ్మల్నీ అనేది’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.  కేంద్రం చేసిన అప్పులన్నీ కార్పొరేట్ల లక్షల కోట్ల రుణాల మాఫీ కోసమే అని ఆయన దుయ్యబట్టారు. ప్రతి బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరన్నారు. మోడీ సర్కార్ పదేళ్లలో రూ. 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  పంటల దిగుబడిలో పంజాబ్‌నే తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుతో దశాబ్దాల పాటు  ఈ నేలను పట్టి పీడించిన తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. వ్యవసాయరంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని వెంటాడిన చిమ్మచీకట్లను శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, మరోవైపు రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అటు కేంద్ర బడ్జెట్ లో ఇటు రైల్వే కేటాయింపుల్లో బీజేపీ సవతి ప్రేమ కనబరుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏడుమండలాలను, లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతుకోసిన విషయాన్ని పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని అన్నారు. కేంద్రం ఖజానా నింపే తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాలని , విభజన హక్కులను నెరవేర్చాలని అడిగిన పాపానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు తెలంగాణకు మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఖర్చులతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వందశాతం ఇళ్లకు మంచినీళ్లిచ్చే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దితే దాన్ని కూడా జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించి యువతకు ఉపాధి కల్పించాలని పదేపదే విజ్ఞ‌ప్తి చేసినా కేంద్రం వినిపించుకోకపోవడం ఆ ప్రాంత ప్రజల పట్ల బీజేపీకి ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. కేంద్రంలో పదకొండేళ్లుగా అధికారంలో ఉన్నా రాష్ట్రానికి దక్కిందేమి లేదన్నారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా ఎనిమిది పైసలు కూడా తీసుకురాలేని అసమర్థతను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి అప్పులపై బురదజల్లి తప్పించుకోలేరని, బీజేపీ చేసిన తప్పులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని కేటీఆర్ పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : kcr telanganam bjp mp budjet

Related Articles