బీసీ రిజర్వేషన్‌పై
నయా డ్రామా !
42 శాతం రిజర్వేషన్‌పై కాలయాపన ధోరణి
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చట్టబద్దత కల్పించి..
మద్ధతివ్వాలని కేంద్రాన్ని కోరనున్న రాష్ట్రప్రభుత్వం
కేంద్రం ఒప్పుకోకుంటే పోరాటం, పార్టీలకు లేఖలు
ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటూ లీకులు
ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై కేంద్రమంత్రి బండి మెలిక
బీసీల్లో ముస్లింలను కలపొద్దంటూ వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై కాంగ్రెస్-బీజేపీల నయా డ్రామా
బీసీలను బురిడీ కొట్టించేందుకు కొత్త ఎత్తుగడ?
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది మరో ఎన్నికల స్టంట్‌గా మారే అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేసి.. బంతిని కేంద్రం కోర్టులోకి వేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. చట్టబద్ధత కల్పిస్తామని, తమిళనాడు తరహాలో చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవరూపం దాల్చడం కష్టమన్న సందేహాలు నెలకొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరితో బీసీలకు మొండిచేయి చూపడం ఖాయమన్న విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 20): బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి అనుమానస్పదంగా ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనను కేవలం బిల్లుకు మాత్రమే పరిమితం చేసేలా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి, కేంద్రంపై భారం వేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోనందన్న టాక్ వినపడుతోంది. ఈ అంశంపై ఇప్పటికే ఇటు రేవంత్ సర్కార్, అటు కేంద్ర మంత్రల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే, బీసీల జాబితా నుంచి ముస్లింలను తొలగించాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుండబద్ధలు కొడుతున్నారు. దీంతో అసలు బీసీ రిజర్వేన్లు సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఇదే అంశాన్ని హైలెట్ చేసి లబ్దిపొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో అఖిలపక్షం తోడుగా రావాలని కూడా పిలుపునిస్తోంది. అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని, కూడగట్టుకునిపోతామని అంటోంది. అయితే ఇది బీసీలను మభ్యపెట్టేందుకేనన్న చర్చ జరుగుతోంది. బీసీలకు 42శాతం కలిపితే మొత్తంగా రిజర్వేషన్ల పరిమితి రాష్ట్రంలో 50శాతాన్ని మించిపోనుంది. 50శాతాన్ని మించి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. అయితే బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అడ్డుపడితే తమిళనాడు తరహాలో వెళ్లేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడులో బీసీలకు 50% రిజర్వేషన్లు (26.5% బీసీలు, 20% ఎంబీసీలు, 3.5% ముస్లిం బీసీలు) కల్పించినప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, 1993లో నాటి జయలలిత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో అప్పటి పీవీ సర్కార్ ఒప్పుకోక తప్పలేదన్న వాదనలు వినపడుతున్నాయి. నాడు చట్టాన్ని చేయడమేగాక, షెడ్యూల్ 9లో దాన్ని చేర్చారు. దీనివల్ల తమిళనాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు మొత్తంగా కలిపి 69శాతానికి చేరుకున్నాయి. కోర్టులలో కూడా దీన్ని ఎవరూ సవాల్ చేయలేకపోతున్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, జయలలిత ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ, ఇప్పటి పరిస్థితులు వేరని, మిత్రపక్షాల అండతో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే బలంగా ఉందని, ఈ క్రమంలో రేవంత్ సర్కార్ ఒత్తిడికి కేంద్రం తలొగ్గడం అంత ఈజీ కాదని చెబుతున్నారు.
ఎన్నికల కోసమే కాంగ్రెస్ హడావుడి!
తమిళనాడును స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ 50శాతాన్ని మించి రిజర్వేషన్లు కల్పించడం ఇప్పుడు సాధ్యం కాదన్న చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్క తమిళనాడు తప్ప అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పరిమితి 50శాతం మాత్రమే. అంతకు మించి లేవు. తాము కూడా 9వ షెడ్యూల్ కింద చేర్చేందుకు పట్టుబడతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒక్కసారి 9వ షెడ్యూల్‌లో చేర్చితే చట్టాలు లేదా నిబంధనలను ఏ కోర్టు, ట్రిబ్యునల్ రద్దు చేయడానికి వీలుండదు. ఆ చట్టాలు, నిబంధనలు మరే తీర్పు, డిక్రీ లేదా ఆదేశానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అమలులో ఉంటాయి. దీనిలో భాగంగానే సుప్రీం కోర్టు, హైకోర్టులు 50 శాతానికి పైగా ఉండే రిజర్వేషన్లను కొట్టివేస్తూ తీర్పులు ఇచ్చినప్ప టికీ, ఆ తీర్పు మాత్రం తమిళనాడుకు వర్తించడం లేదు. దీంతో తాము చేసే చట్టాన్ని కూడా షెడ్యూల్9లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే దీన్నే అస్త్రంగా చేసుకుని, స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తాము బిల్లుకు ఆమోదం తెలిపినా, కేంద్రంలోని మోడీ సర్కార్ అడ్డుకుందంటూ నెపాన్ని వాళ్లపై నెట్టేసి ఓట్లు దండుకోనుందన్న చర్చ జరుగుతోంది. బీసీలను మోసం చేసేందుకే ఢిల్లీకి అఖిలపక్షం, 9వ షెడ్యూల్, కేంద్రంపై ఒత్తిడి అంటూ కాంగ్రెస్ హడావుడి చేస్తోందని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ అంత ఈజీగా రేవంత్ రెడ్డికి తలొగ్గుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇదేదీ సాధ్యం కాదని తెలిసినా డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు.