ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ?
ఇద్దరు కీలక అధికారులపై సీఎం సీరియస్
ఇటీవలే ఇంటికి పిలిపించుకుని క్లాస్ పీకిన రేవంత్
అసలు ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ?
గత ప్రభుత్వంలో అన్నీ ముందుగానే తెలిసేవి
ఇప్పుడేమో ఇన్సిడెంట్స్ జరిగాక తెలుస్తున్నాయ్
ప్రభుత్వ డ్యామేజ్ అయ్యే అంశాలను..
మీరు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు ?
ఇలాగే పనిచేస్తే యాక్షన్ తప్పదని సీఎం వార్నింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత పూర్తిస్థాయిలో..
పని చేయలేకపొతున్న ఇంటెలిజెన్స్ అధికారులు..!
మంత్రి కోమటిరెడ్డి ప్రెస్ మీట్ తో మరోసారి తేటతెల్లం
‘‘ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు కీలక అధికారులను ఇంటికి పిలిపించుకొని మరీ క్లాస్ పీకినట్టు సమాచారం. ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే అంశాలను గుర్తించడంలో ఫెయిల్యూర్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే గత ప్రభుత్వంలో అన్నీ ముందుగానే తెలిస్తే ఇప్పుడేందుకు జరిగాక తెలుస్తున్నాయని అడిగినట్లు సమాచారం. ఇప్పుడెందుకు మీరు సరిగ్గా పనిచేయడం లేదని, ఇలాగే చేస్తే సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ‘‘
తెలంగాణం, బ్యూరో (ఫిబ్రవరి 20) : రాష్ట్ర భద్రత విషయంలో కీలకంగా పని చేసే ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ డిపార్టుమెంట్ లోని కీలక అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ శాఖలకు సంబంధించిన ఇద్దరు కీలక అధికారులను తన ఇంటికి పిలిపించుకొని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ ను ముందుగా గుర్తించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో అన్నీ ముందుగానే తెలిసేవని, ఇప్పుడేందుకు ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తెలుస్తున్నాయ్ అని మండిపడ్డారు. అసలు మీరేం చేస్తున్నారని, ఏరికోరి తీసుకొచ్చి డిపార్టుమెంట్లో పెడితే ఎందుకు సరిగ్గా పని చేయడం లేదని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లగచర్లలో గిరిజనుల పోరాటం, గ్రూప్స్ 1 అభ్యర్ధులు వరుసగా ఆందోళనలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహాస్యంగా భేటీ కావడంతో పాటు అనేక అంశాలు ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగేలా జరిగాయి. ఇలాంటి ఘటనలను ఎందుకు ముందుగానే గుర్తించలేకపోతున్నారని అధికారులను రేవంత్ రెడ్డి నిలదీసినట్లు సమాచారం. మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడటంతో పాటు చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలాగే మీరు పని చేస్తే మీపై సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుందని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లుగా సమాచారం.
భయం భయంగా పని చేస్తోన్న అధికారులు..!
ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ అధికారులు పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్, ఎస్ఐబీలో కీలకంగా పని చేసిన అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. దాదాపు ఏడాది పాటు జైల్లో పెట్టించింది. దీంతో ఆ శాఖలకు సంబంధించిన అధికారులు భయం భయంగా పని చేస్తున్నట్లు సమాచారం. రేపు ప్రభుత్వం మారితే ఇదే గతి మాకు కూడా వస్తుందన్న భయంతో ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ అధికారులు పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే సరిగ్గా పని చేయకపోతున్నామని అధికారులు చర్చించికుంటున్నట్లు తెలుస్తోంది.
మంత్రి కోమటిరెడ్డి దాటవేత
భూపాలపల్లి హత్యపై నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజలింగాన్ని బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మీ ఇంటెలీజెన్స్ విభాగం ఏం పని చేస్తుందని మీడియ ప్రతినిధులు ప్రశ్నించగా దానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం దాట వేశారు. ఇంటెలీజెన్స్ గురించి చెప్పకుండా... బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు చేసుకుంటుందట అంటూ పొంతనలేని సమాధానం చెప్పుకొచ్చారు.