మానవతావాదులను ఆలోచింపజేసేలా ఉన్న ఈ ఘటన ఝార్ఖండ్‌లో వెలుగుచూసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న తన తల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసి తన అత్తమామలు, తన భార్యాపిల్లలతో ప్రయాగ్ రాజ్ పుణ్యస్నానాలకు వెళ్లిపోయాడు. మూడు రోజులకు ఆకలి బాధకు తాళలేక ఆమె పెడుతున్న కేకలు విని ఇరుగుపొరుగు వారు రక్షించారు. మానవతావాదులను ఆలోచింపజేసేలా ఉన్న ఈ ఘటన ఝార్ఖండ్‌లో వెలుగుచూసింది.
రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. వయసు రీత్యా అనారోగ్యంతో కొడుకు అఖిలేశ్ కుమార్ ఇంట్లో ఉంటుంది. కొడుకు ప్రయాగ్ రాజ్ వెళ్తున్న దగ్గర నుంచి ఆమె అటుకులే తింటోంది. ఆ కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఆకలికి తాళలేక ప్లాస్టిక్ తినేందుకు ప్రయత్నించింది. ఇంట్లో అన్నీ ఉన్నా వంట చేసుకునే పరిస్థితిలో లేకపోవడంతో ఆమె పెద్ద పెద్ద కేకలు వేసి చుట్టుప్రక్కల వారిని పిలవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోంచి బిగ్గరగా కేకేలు, ఏడుపు వినిపించడంతో పక్కింటివాళ్లు మరో చోట ఉంటున్న ఆమె కుమార్తె చాందినీ దేవికి విషయాన్ని తెలియపరిచారు. వెంటనే కూతురు పోలీసులకు తెలియజేయగా ...వారు వెళ్లి ఇంటి తాళం పగలగొట్టారు.
పొరుగింటి వారు ఆమెకు భోజనం పెట్టి.. సపర్యలు చేసి.. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తల్లికి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసే వెళ్లామని కొడుకు చెప్తున్నా...అనారోగ్యం కారణంగా తను ఏం వంట చేసుకోలేదని తెలిపారు. ఇలా వెళితే మాత్రం పుణ్యం కలిసివస్తుందని అనుకోవడం వెర్రితనం అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.