భయపెట్టి, బూతులు తిట్టి
సాక్ష్యం చెప్పించారు..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేధించారు!
నానా బూతులు తిట్టారు
హరీశ్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలన్నారు
కేసులో ఇరికించాలని చూస్తున్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో వంశీకృష్ణ అఫిడవిట్
ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 20): పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ టాపింగ్ కేసులో ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములలకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 20వేల పూచికత్తు, రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బుధవారం హైకోర్టు ఇచ్చిన మద్యంతర స్టే ఉత్తర్వులను నాంపల్లి కోర్టుకు నిందితుల తరపు న్యాయవాది లక్ష్మణ్ సమర్పించారు. దీంతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులపై వంశీకృష్ణ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. తన కొడుకు చేయని పనికి నిందలు వేస్తున్నారని తల్లి ఆరోపించారు. బలవంతంగా మాజీ మంత్రి హరీశ్ రావు పేరు చెప్పాలని నానా బూతులు తిట్టారన్నారు. తాము కిరాయికి ఉంటున్న ఇంటి ముందు నోటీసులు అంటించి ఇబ్బందులు పెట్టారన్నారని వాపోయారు. హరీశ్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని డీసీపీ వేధించాడని అఫిడవిట్‌లో వంశీకృష్ణ పేర్కొన్నాడు. డీసీపీ, ఏసీపీ నానా దుర్భాషలు ఆడారన్నారు. హరీశ్ రావును ఈ కేసులో ఇరికించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని తెలిపాడు.
ఇదిలా ఉంటే, పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 3 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం జరిగిన విచారణలో జస్టిస్ లక్ష్మణ్ పీపీ అభ్యర్థన మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.