అధికారులతో..
రేవంత్ ఆటలు..!
బ్యూరోక్రాట్లతో కోల్డ్ వార్..!
కొరివితో గోక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారుల నైతికతను దెబ్బతీస్తున్న వైనం
ఏడాది పాలనలో లెక్కలేనన్ని బదిలీలు
ఒకే నెలలో 4 సార్లు బదిలీలు చేసిన సందర్భాలు
ఐఏఎస్, ఐపీఎస్‌లపై కక్షగట్టినట్టుగా తీరు
నచ్చని అధికారులకు అప్రాధాన్యపు పోస్టులు
కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వం
మరోవైపు నోరు జారుతున్న మంత్రులు
వివాదాస్పదంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి
మాట వినకపోతే సస్పెండ్ చేస్తానంటూ వార్నింగులు
దూరం పెంచుకుంటున్న రేవంత్ సర్కార్
ఏ వృత్తిలోనైనా ఉద్యోగి నైతికతను దెబ్బతీస్తే ఆ ఉద్యోగి నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టడం అసాధ్యం. ఇన్ సెక్యురిటీగా ఫీల్ అయితే మరింత కష్టం. ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండి, తగిన ప్రోత్సాహం, నమ్మకం కల్పిస్తే రెండింతలు వారు ఉత్సాహంతో పని చేస్తారన్నది అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏసీ గదులను దాటి బ్యూరోక్రాట్లు బయటకు రావడం లేదంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కార్యనిర్వాహక వ్యవస్థలో కీలకమైన ఐపీఎస్ అధికారులపై సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నిత్యం బదిలీలతో, సూటిపోటి మాటలతో వారిని వేధిస్తే కలిగే నష్టం ఊహకందనిదిగా ఉంటుంది. డైనమిక్ ఆఫీసర్లను అప్రాధాన్యపు పోస్టులకు పరిమితం చేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సంకేతాలను పంపుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను చులకన భావంతో చూస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 18) :
ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటి అయినా కార్యనిర్వాహక వ్యవస్థ నైతికతపై రేవంత్ సర్కార్ దెబ్బకొడుతోంది. వారిని వేధింపులకు గురి చేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి మూడు కేసులు.. ఆరు బదిలీలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యహరిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లను కేసుల్లో ఇరికిస్తూ బోనుల్లో నిలుచోబెడుతున్న వైనం రాజకీయ వర్గాల్లో మాత్రమే గాక, సామాన్యులనూ ఆలోచింప చేస్తోంది. వారిని పదే పదే బిదిలీ చేస్తూ, ఏ ఒక్క చోటా సరిగ్గా పని చేయకుండా చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. నచ్చనివారిపై కేసులు, బదిలీలు, అప్రాధాన్య పోస్టులు అంటూ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నచ్చినవారికి ఒకటి కంటే ఎక్కువ శాఖలను కేటాయిస్తూ మిగిలిన వారిపట్ల వివక్ష చూపుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారని సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి బ్రూరోక్రాట్లపై బదిలీల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టిన సందర్భాలు లెక్క లేనన్ని ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పని చేసిన వారందరిని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్మితా సబర్వాల్ వంటి డైనమిక్ ఆఫీసర్‌ను అప్రాధాన్యపు పోస్టులకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఆమ్రపాలి రెడ్డి లాంటి ఆఫీసర్లకు నాలుగేసి శాఖలు కేటాయించడం విశేషం. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు మరో మూడు, నాలుగు డిపార్ట్‌మెంట్స్‌ను ఆమెకు అప్పగించారు. ఇదిలా ఉంటే రొనాల్డ్ రాస్ లాంటి అధికారులను తరుచూ బదిలీల పేరుతో శాఖల మార్పు చేయడం విమర్శలపాలైంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఇప్పుడు పని చేస్తున్నప్పుడు.. పనితీరులో ఏం మార్పు వస్తుందన్న చర్చ జరుగుతోంది. వారితో పని చేయించుకోవడం చేతగాకనే సీఎం ఇష్టారీతిన బదిలీలు చేపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. మరోవైపు అధికారులపై మంత్రుల నోటి దురుసు కూడా వివాదాస్పదమైంది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
బలవంతపు కేసులు
దాన కిషోర్ లాంటి సీనియర్ అధికారులతో కేసులు పెట్టించడం కూడా చర్చకు దారితీసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో దాని కిషోర్ ఫిర్యాదుతోనే కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేయడం కూడా అధికారుల్లో ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్న విమర్శలు వినిపించాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనూ పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. నెలకు మూడు నాలుగు సార్లు ఈ బదిలీలు ఉండడం గమనార్హం. అధికారులను తరుచూ బదిలీ చేయడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. వారిని అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల పని మీద ప్రభావం పడుతుంది. రైజింగ్ తెలంగాణ అంటూ ప్రచారం చేసుకోవడమే కానీ, ప్రభుత్వంలో కీలకమైన అధికారులను ఇబ్బందులకు గురి చేస్తే వచ్చే ఫలితాలు శూన్యం.
కొరివి తలగోక్కోవడమే!
ఇక తాజాగా, మాటవినకపోతే సస్పెండ్ చేస్తామనేంతగా ఐఏఎస్ ఆఫీసర్లపై రేవంత్ సర్కార్ కొరడా ఝులిపిస్తోంది. అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఆఫీసుల నుంచి ఫీల్డులకు వెళ్లని వారిపై వేటు తప్పదని వార్నింగ్ ఇవ్వడం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్‌కు ఇది సంకేతమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తమ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో బ్యూరోక్రాట్లతో డైరెక్ట్ యుద్ధానికి రేవంత్ సర్కార్ దిగిందన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహార శైలితో రేవంత్ కొత్త చిక్కులను కొని తెచ్చుకుంటుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్న రేవంత్ సర్కార్.. బ్యూరోక్రాట్ల నుంచి కూడా వ్యతిరేకతను ఫేస్ చేయడం అంటే కొరివి తలగోక్కోవడమేనని విమర్శకులు అంటున్నారు.