అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్ష రుణం మాఫీ చేశామని చెబుతూ రూ. 2 లక్షలు మాఫీ చేసినట్లు ప్రకటనలా చేస్తిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం చూస్తే గోబెల్స్ కూడా మూర్చపోతారని అన్నారు. యాసంగి రైతుబంధులోనే రూ. 2 వేల కోట్లు ఎగ్గొట్టారు. రైతుభరోసా ప్రకారం చూస్తే రూ. 6 వేల కోట్లు ఎగ్గొట్టారని తెలిపారు. వానాకాలం రైతుభరోసా ఊసే లేదని, కోటి 30 లక్షల ఎకరాలకే ఇస్తారనుకున్నా రైతులకు ఎకరాకు రూ. 7,500 చొప్పున రూ. 10 వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ. 6 వేల కోట్లు ఇచ్చారు. 10 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి 73 లక్షల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ. 2,500 చొప్పున బాకీ పడిందన్నారు. దీని అమలుకు ఏడాదికి రూ. 41,700 కోట్లు కావాలని, 40 లక్షల మంది ఫించనుదారులు, దివ్యాంగులకు ఏడు నెలలుగా నెలకు రూ. 2 వేల చొప్పున బాకీ పడిందని తెలిపారు.
30 లక్షల మంది నిరుద్యోగులకు ఏడు నెలలుగా నెలకు రూ. 4 వేల చొప్పున బాకీపడింది. రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నారు. వారికి రూ. 15 వేల చొప్పున రూ. 975 కోట్లు బాకీపడిందని తెలిపారు. రైతు కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని చెప్పింది. రాష్ట్రంలో 52 లక్షల మందికి పైగా ఉపాధిహామీ కూలీలు ఉన్నారని ఈ లెక్కన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6,240 కోట్లు బాకీపడిందన్నారు. కోటి 30 లక్షల టన్నులకు వరిధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున రూ. 6,500 కోట్లు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. సేకరించిన ధాన్యానికి కూడా రూ. 500 బోనస్ ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మంది విద్యార్థులు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసుకుంటున్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల నుండి రూ. లక్ష వరకు బాకీపడిందని నిరంజన్ రెడ్డి తెలిపారు.