Niranjan Reddy: ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి

కాంగ్రెస్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలు గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.


Published Jul 17, 2024 01:24:46 PM
postImages/2024-07-17//1721202886_nn2.jfif

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలు గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష ఒక్కసారి చేస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. రైతులు అందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఆంక్షలను చెప్పలేదని, మేనిఫెస్టోలో పెట్టలేదని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత అప్పులు, వడ్డీలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటును ఆఖరు నిమిషం వరకు అడ్డుకుని వందల మంది బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు నాయుడు కూడా పదేళ్లలో తెలంగాణ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఎదిగిందని ఒప్పుకున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలుస్తుంది. 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం అంటున్నారు. మరి మిగిలిన 49 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల గుర్తింపుకే రేషన్ కార్డు అంటున్నారు.  మరి రేషన్ కార్డు లేని రైతుల పరిస్థితి ఏంటి? కొద్దిమందికి ఇచ్చి సంబరాలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. రైతుకు సాయం విషయంలో వర్గీకరణ, ఆంక్షలు విధించవద్దు అని, గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రుణాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


రెండు లక్షల వరకు ఉన్న రుణాలు అన్నీ ప్రభుత్వం మాఫీ చేయాలి.. రైతు కడితేనే ఇస్తాం అనడం కాలయాపన చేయడమే అన్నారు. వ్యవసాయం చేయకుండా పట్టాదారు పాస్‌బుక్ కలిగి ఉండి రైతుబంధు పొంది ఉన్నట్లయితే అదే పాస్‌బుక్‌తో రుణం కూడా  తీసుకుని ఉంటాడు కదా అని ప్రశ్నించారు. మరి ఏ కారణాలతో రైతు భరోసా నిలిపివేస్తున్నారు? రుణమాఫీ చేసినట్లే రైతుభరోసా కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ఐదెకరాల వరకు ఉన్న రైతులకన్నా రైతుభరోసా ఇవ్వండి అని కోరారు. రుణమాఫీకి పట్టదారు పాస్‌బుక్కును ప్రామాణికంగా తీసుకుంటే రైతుభరోసాకు కూడా దానినే ప్రామాణికంగా తీసుకుని ఇవ్వాలని కొండలు, గుట్టలు అంటూ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధులు మళ్లిస్తున్నారని, రూ.40 వేల కోట్లు ఏకబిగిన మాఫీ చేస్తాన్నారు. ఆ తర్వాత రూ. 31 వేల కోట్లు అని అంటున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాడు లేని ఆంక్షలు నేడు ఎందుకు? పట్టాదారు పాస్‌బుక్ ప్రామాణికంగా రుణమాఫీ చేయాలన్నారు. అనర్హులు ఉంటే ప్రభుత్వం ఏరి వేసుకోవచ్చు షరతులు లేని రుణమాఫీ జరగాలని తెలిపారు. గత ప్రభుత్వం రెండు విడతలలో రూ. 29 వేల కోట్లు రుణమాఫీ చేశామని, ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో రూ. 6 వేల కోట్ల రుణాలు మాత్రమే మిగిలిపోయాయి. ఆంక్షలు లేకుండా రైతులకు పథకాలు అమలు చేశామని తెలిపారు. లక్ష వరకు ఎంత మంది? రెండు లక్షల వరకు ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. 


కరెంటు లేక, నీళ్లు లేక రైతాంగం నానాయాతన పడుతున్నారు. క్రిష్ణా బేసిన్‌లో ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదన్నారు. ఇలాంటి సమయంలో రైతులకు రైతుభరోసాతో చేయూతనిస్తే వారు దైర్యంగా వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం బలపడితే, స్థిరపడితే అన్నదాతలు వేల మందికి ఉపాధినిస్తారని పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతలకు అండగా నిలిచామన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీళ్లు, ఉచిత కరెంటు, పంటల కొనుగోళ్లు చేసి రైతులలో ఆత్మవిశ్వాసం నింపాం అని, లక్ష 20 వేల మంది రైతు కుటుంబాలకు రూ. 600 కోట్ల పైచిలుకు రైతుబీమా అందించామని తెలిపారు. 2014 లో కోటి 31 లక్షల ఎకరాలలో ఉన్న సాగును 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెంచాం, 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తిని దాదాపు 3 కోట్ల టన్నులకు పెంచుకున్నామని తెలిపారు. రూ. లక్ష 33 వేల కోట్లతో 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఏటా రూ. 10,500 కోట్ల సబ్సిడీ భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందించామన్నారు. పదవిచ్చిన ప్రజలను వదిలేసి పదవులు ఉన్న నాయకులను చేర్చుకుంటున్నారు. ఆయారాం, గయారాం అనే పదం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ వల్ల అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కట్టిన రైతువేదికలు ఈ రోజు కాంగ్రెస్ వేడుకలకు పనికివస్తున్నాయి అన్నారు. ఆనాడు వ్యతిరేకించిన రైతు వేదికలు, కాళేశ్వరం, సచివాలయాలు నేడు కాంగ్రెస్ పార్టీకి దిక్కయ్యాయి. అధికారం కోసం నిరుద్యోగులను వాడుకుని నేడు వారి మీద నిర్భంధం విధిస్తున్నారు. అప్పు కోసం చేయిచాచని అన్నదాత కోసం పదేళ్లు పనిచేశామని, హామీల అమలుకు కాంగ్రెస్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది. పథకాలు ఎగ్గొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people brs congress singireddyniranjanreddy

Related Articles