ఆత్మహత్యల తెలంగాణ..!
14 నెలల కాంగ్రెస్ పాలనలో...
450 మందికి పైగా రైతుల మృతి
రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలు
మార్చి నెలలోనే ఐదారుగురు కన్నుమూత
మార్చి 1న డిప్యూటీ సీఎం ఇలాఖాలో మిర్చి రైతు
మార్చి 2న మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య
అప్పులభారంతో తనువు చాలిస్తున్న రైతులు
రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు
మార్చి 3న బ్యాంకోళ్ల వేధింపులతో నల్లగొండలో రైతు ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యలను ఆపే దిశగా చర్యలు తీసుకోని సర్కారు
హైలైట్ బాక్స్..
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటరు. కని ఇప్పుడు రాష్ట్రంలో రైతన్న ఏడ్వటమే కాదు.. ఏడ్చే ఓపిక కూడా నశించి తనువు చాలిస్తున్నాడు. నేలతల్లిని నమ్ముకుని ఉన్నదంతా పెడితే చిల్లిగవ్వ తిరిగొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అప్పులభారం నెత్తిమీద కుంపటిలా మారింది. రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు మాటలు నీటి మూటలు.. నీటి మీది రాతలే అయ్యాయి. మరో మార్గం లేక.. నేలతల్లిపై కోపం చూపించలేక.. ఉరికొయ్యకు వేలాడుతున్నారు. నేలతల్లి ఒడిలోనే ఒదిగిపోతున్నారు. కేవలం 14 నెలల కాలంలో 450 మందికి పైగా రైతులు తనువు చాలించారు.
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 5) : తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక పంట పొలాల్లోనే రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 450 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితులు నానాటికి చేయి దాటిపోతున్నాయి. ముఖ్యంగా రైతుభరోసా రాక, రుణమాఫీ అవక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో డబ్బులు కట్టని వారిని బ్యాంకులు వేధిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో అప్పు చెల్లించని వారి ఇంటి ముందు పొయ్యిలు పెట్టారు. జనగామ జిల్లాలో రైతు ఇంటి గేటును తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లాలో రైతు బైకును జప్తు చేసి పట్టుకెళ్లారు. ఇలాంటి ఘటనలు రైతులను మరింత క్షోభకు గురిచేస్తున్నాయి. ఆత్మహత్యకు కారణమవుతున్నాయి.
రూ.5 లక్షల అప్పు తీర్చలేక..
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మామిండ్ల కనకరాజు అనే 27 ఏళ్ల యువ రైతు అప్పుల బాధతో ప్రాణాలు తీసుకున్నాడు. ఎకరా అసైన్డ్ కోసం నాలుగు బోర్లు వేశాడు. అందులో ఒకదాంట్లోనే కొద్దిగా నీళ్లు వస్తున్నాయి. దీంతో మరో బోరు వేసేందుకు అప్పు చేశాడు. అప్పటికే ఉన్న అప్పుతో కలిసి మొత్తం రూ.5 లక్షల వరకు పెరిగింది. అది తీర్చే మార్గం లేక ఫిబ్రవరి 9న రాత్రి 11 గంటలకు పొలం దగ్గర గడ్డిమందు తాగాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న కన్నుమూశాడు.
రెండు నెలల తండ్రి.. ఇప్పుడు కుమారుడు..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లికి బండారి రవీందర్ (30) అనే రైతుకు ఎకరా పొలం ఉంది. రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. దానికోసం రూ.6 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే పరిస్థితి లేక.. మరో మార్గం కనిపించక ఫిబ్రవరి 10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం రవీందర్ తండ్రి మల్లయ్య సైతం ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎండిన బోర్లు.. ఆగిన ఊపిరి..
జనగామ జిల్లా నర్మెటకు చెందిన ముక్కెర బాలరాజు (35) అప్పుల బాధతో ఫిబ్రవరి 11న పొలంలో ఊరి వేసుకుని చనిపోయాడు. తన రెండెకరాల పొలంతో పాటు, తమ్ముడికి చెందిన మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిర్చి పంటలు వేశాడు. ఫిబ్రవరి మొదటి వారంలో రెండు బోర్లు ఎండిపోవడంతో ఆందోళనలో మునిగిపోయాడు. కొద్దిరోజుల క్రితమే రూ.1.5 లక్షలు పెట్టి కొన్న ఆవు చనిపోవడంతో మరింత కుంగిపోయాడు. అప్పటికే చేసిన అప్పు రూ.8 లక్షల వరకు అయ్యింది. దీంతో ప్రాణాలు తీసుకున్నాడు.
రూ.10 లక్షల అప్పు తీర్చలేక..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురానికి చెందిన గంధం లక్ష్మి (52) ఫిబ్రవరి 27న తన ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించారు. వీరికి రెండు ఎకరాల భూమి ఉంది. అందులో పత్తి సాగు చేశారు. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో మిర్చి, మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. సరైన దిగుబడులు రాక రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పు ఎలా తీర్చాలనే ఆందోళనతో లక్ష్మి ఊరి వేసుకుని చనిపోయారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్‌కు చెందిన రైతు పిట్ల రాజు (44)కు ఎకరం పొలం ఉంది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు కలిసి తలకు మించిన భారంగా మారాయి. ఇటీవలే పెద్ద కుమార్తెకు పెండ్లి కుదిరింది. దీంతో డబ్బుల కోసం కొద్దిరోజులుగా ఆందోళనకు గురైన ఆయన ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం జిల్లాలోని చిన్నమండవ గ్రామానికి చెందిన అగ్గిరాముడు(40) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన ల్యాదల్ల శ్రావణ్(21) ఫిబ్రవరి 28న మృతి చెందాడు. మరోవైపు పంట దిగుబడులు రాక.. పెట్టుబడులు భారమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లుపల్లె గ్రామంలో అప్పుల బాధతో మిర్చి రైతు గత నెల 27న ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.వెంకటేశ్వర్లుపల్లె గ్రామానికి చెందిన బండారు రవి (54) తనకున్న రెండెకరాల భూమిలో మిర్చి పంటను సాగు చేశాడు. పంటకు నల్లితెగులు రావడంతో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి పురుగుల మందులు కొట్టాడు. మిర్చి పంట పేరు మీద రూ. 4 లక్షలు ఖర్చు చేశాడు. పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతోపాటు గతంలో మిర్చిపంట నిమిత్తం చేసిన మరో రూ. 5 లక్షల అప్పు ఎలా కట్టాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు.ఈ క్రమంలో గత నెల 26న పంటచేను వద్దకు వెళ్లి అక్కడే ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా రవిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందాడు.ఇలా అనేకమంది రైతులు ఆవేదనతో నేలరాలుతున్న హృదయ విదారక పరిస్థితులున్నాయి.
48 గంటల్లోనే 8 మంది రైతులు మృతి..
ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రాష్ట్రంలో 8 మంది రైతులు తనువు చాలించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లికి చెందిన మట్టపల్లి వెంకన్న, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి చెందిన అరికాంతపు రాజు(38), రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ కు చెందిన జెల్ల దేవయ్య(51), భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లెకు చెందిన మంద చంద్రయ్య, కొత్తగూడెం జిల్లా కూసుమంచి మండలం తురకగూడేనికి చెందిన బుర్ర దర్గయ్య (30), నిర్మల్ జిల్లా భైంసా గ్రామానికి చెందిన హంపొలి ప్రభాకర్ రెడ్డి (42), హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన కడుదల విజేందర్ (36), సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్ పల్లికి చెందిన బుజ్రంపల్లి దుర్గయ్య(74) ఆత్మహత్య చేసుకున్నారు.
బ్యాంకోళ్లు భూమిలో జెండాలు పాతారని రైతు ఆత్మహత్యాయత్నం..
నల్గొండ జిల్లా కనగల్లు మండలం జీ యడవల్లికి చెందిన రైతు గౌని వెంకన్నకు కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ.1,60,000 రుణం ఉంది. ఈ రుణం మాఫీ కాలేదు. దీంతో ఆ డబ్బులు కట్టాలని బ్యాంకు అధికారులు ఫిబ్రవరి చివరి వారంలో భూమిలో జెండాలు పాతారు. అయినా కూడా డబ్బులు లేక రైతు బ్యాంకుకు చెల్లించలేకపోయాడు. దీంతో మార్చి 4న
వచ్చి ఊరిలో డప్పు చాటింపు చేస్తామని.. పొలం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకన్న మార్చి 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో రైతుది ఒక్కో ధీన గాథ. కానీ అప్పుల భారమే అందరి ప్రాణాలను మింగేసింది. సర్కారు చేస్తామన్న రుణమాఫీకి కొర్రీలు పెట్టింది. రూ.40వేల కోట్లకు పైగా రుణాలు ఉంటే.. కేవలం రూ.21వేలకోట్లతో సరిపెట్టేసింది. అందులోనూ కేవలం రూ.12 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రైతులకు అందాయి. మరో రూ.9వేల కోట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మరోవైపు రైతుభరోసా డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బులు లేక తీవ్రంగా కుంగిపోతున్నారు. దీనికి తోడు యాసంగి పంటలకు నీరు లేక పెట్టిన పెట్టుబడి కూడా బూడిదపాలైంది. దీంతో చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయినా కూడా ఈ ఆత్మహత్యలను ఆపడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.