మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం పురుషోత్తమయ గూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.
న్యూస్ లైన్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం పురుషోత్తమయ గూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ ఆ ప్రాంతం మొత్తం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్‌లకు పయనిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సింగరేణి మండలం గంగారాం తండాలో నునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. రెండు రోజుల కిందట కారులో హైదరాబాద్ వెళ్తూ ప్రమాదవశాత్తు ఆకేరు వాగు వరదలో కొట్టుకుపోయి నునావత్ మోతీలాల్, ఆయన కుమార్తె యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని మృతి చెందారు. మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి సీఎం రేవంత్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.