వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల సన్నిహితులకు సంబంధించిన కట్టడాలకు కూడా హైడ్రా నోటీసులు పంపించింది. ఇది ఇలా ఉండగా.. బడా బాబులకు నోటీసులు పంపుతున్న హైడ్రా.. పేదల ఇళ్లను మాత్రం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చేస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తోందని ఇప్పటికే ప్రతిపక్షాలు పదే పదే చెబుతూనే ఉన్నాయి. ఇది నిజం అనిపించేలా హైదరాబాద్ మహానగరంలో బుల్డోజర్ కూల్చివేతలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు జరిగిన విషయం తెలిసిందే. హీరో నాగార్జునకు సంబంధించిన N-కన్వెన్షన్‌ను అధికారులు కూల్చేశారు.
జలాశయాల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా కమిషన్.. చెరువులు, వాటి పరిసరాల్లో ఉన్న కట్టడాలను కూల్చివేస్తోంది. ఇందులో భాగంగానే పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల సన్నిహితులకు సంబంధించిన కట్టడాలకు కూడా హైడ్రా నోటీసులు పంపించింది. ఇది ఇలా ఉండగా.. బడా బాబులకు నోటీసులు పంపుతున్న హైడ్రా.. పేదల ఇళ్లను మాత్రం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చేస్తోంది.
హైదరాబాద్ రాంనగర్‌లోని మణెమ్మ బస్తీలో శుక్రవారం హైడ్రా అధికారులు కూల్చివేతలు జరిపారు. మణెమ్మ బస్తీలో నాలా స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించినట్లు గుర్తించామని హైడ్రా అధికారులు వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని GHMC రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయితే, ఆ కట్టడాలు అన్నీ అక్రమంగా వెలిసినవేనని తేలడంతో కూల్చివేతలు జరుపుతున్నామని హైడ్రా అధికారులు తెలిపారు.