న్యూస్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదట. ఖమ్మం పర్యటనను కూడా వాడేసుకున్నారని తెలుస్తోంది. వరద బాధితులను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లారు. సాధారణంగా వదర బాధితుల దగ్గరకు వెళ్లినప్పుడు ఎవరైనా వారి ఇళ్లకు వెళ్లి, వారున్న చోటికి వెళ్లి, వారిని కలిసి మాట్లాడతారు. కానీ సీఎం టూర్ లో అవేవీ లేకుండా చేశారు. ఒకట్రెండు ఇళ్లను మాత్రమే పరిశీలించారు. ఆ తర్వాత రోడ్ షో చేస్తూ వెళ్లిపోయారు. ఇలా ప్రచారరథంపై ఎక్కి చేతులూపుతూ వెళ్లిపోవడంపై స్థానికులు భగ్గుమన్నారు. తమ బాధలు తెలుసుకోని వ్యక్తి ఎందుకు వచ్చారంటూ మండిపడ్డారు. పరామర్శకు వచ్చి ప్రచారరథంపై తిరగడమే బాగోలేదు. దీనికి తోడు ఏర్పాటు చేసిన వాహనం కూడా ఎన్నికల ప్రచార రథం కావడం మరింత అభాసుపాలు చేసిందని తెలుస్తోంది. పార్టీ సింబల్స్ కనిపించకుండా ఇలా క్లాత్ తో కవర్ చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. సీఎం పర్యటించింది కూడా జిల్లా కేంద్రంలో. అలాంటప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వేరే మంచి వాహనమే దొరకలేదా అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. అవసరమైతే హైదరాబాద్ నుంచి ప్రభుత్వ వాహనం తెప్పించి పర్యటించవచ్చు. కానీ అలా జరగపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పర్యటనలో ఆధ్యంతం ప్లానింగ్ తో, జాగ్రత్తగా ఉండాల్సిన అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా చర్చనీయాంశమైంది.
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన తర్వాత జనాల్లోనే కాదు పార్టీ వర్గాల్లోనూ ఇదే చర్చ నడుస్తోందట. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు గుడ్డలు కట్టడం ఏంటని చర్చించుకుంటున్నారట. ఇదీ కావాలని చేసినట్లుగానే ఉందని, మరీ ఇంతలా అవమానించాలా ? అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. కొందరు దురుద్దేశపూర్వకంగానే ఇలా చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. రేవంత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొందరు మాట్లాడుకుంటున్నారు. కేవలం వాహనం విషయంలోనే కాదు.. సీఎం షెడ్యూల్ విషయంలోనూ కుట్రలు జరిగాయని ఆయన వర్గం నేతలు బాధపడుతున్నారట. కారు దిగి ప్రజలను కలవకుండా చేశారని.. తద్వారా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేలా చేశారని మండిపడుతున్నారట. ముఖ్యమంత్రిని పిలిచి మరి అవమానిస్తారా అని ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఓ వైపు ప్రజలు బాధల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి.. ఇలా సొంత పార్టీ వాళ్లే ఒకరిని ఒకరు అవమానపర్చుకోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా సీఎం వర్గం ఉందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.