ఎల్లవ్వ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని పోచయ్య చెప్పినప్పటికీ అధరాలు లేకపోవడంతో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్: ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే అంత అన్యాయం జరిగినట్లు అనే మాట నిజం అనేది మరోసారి రుజువైంది. ఓ నిర్దోషికి శిక్ష పడిన తరువాత అతను ఏ తప్పు చేయలేదని తేలింది. కానీ, అప్పటికే అతను మరణించాడు. న్యాయం త్వరగా జరగాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవల అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అత్యాచార కేసులో కూడా త్వరగా న్యాయం జరుగుతుందని బాధితుల్లో ధీమా కల్పించాలని ఆయన అన్నారు. ఈ రకంగా దోషులకు కూడా త్వరగా శిక్ష పడే అవకాశం ఉందని.. అందుకే ఒక్కో జిల్లాకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అయితే, తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవల్లి గ్రామానికి చెందిన పోచయ్య తన వృద్ధ తల్లి ఎల్లవ్వను హత్య చేశాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. 2013లో ఎల్లవ్వ మృతిచెందింది. అయితే, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిచాడనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సిద్ధిపేట జిల్లా కోర్టు కూడా 2015లో పోచయ్యను దోషిగానే పరిగణించి శిక్ష విధించింది. ఎల్లవ్వ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని పోచయ్య చెప్పినప్పటికీ అధరాలు లేకపోవడంతో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు కూడా హత్యా లేదా ఆత్మహత్యా అనేదాన్ని చెప్పలేక పోయారు. అయినప్పటికీ, పోచయ్యకు జీవితఖైదు విధించారు. ఇక పోచయ్య జైల్లో ఉండగానే 2018లో గుండెపోటుతో మృతిచెందాడు. ఈ క్రమంలోనే అతని కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారంలో భాగంగా కేసు ఏళ్ల తరబడి వాయిదాలపై నడిచింది. అయితే, కుటుంబసభ్యులు ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం పోచయ్య నిర్దోషి అని తెలిపింది. అతను 2018లో మరణించాడని తెలియక అతన్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిర్దోషి అయినప్పటికీ తన తండ్రికి శిక్ష విధించారని, తండ్రిని కోల్పోవడమే కాకుండా ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయామని పోచయ్య కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి 11 ఏళ్ల తరువాత నిర్దోషి అని తేలినప్పటికీ ఈ లోకంలో తన తండ్రి లేదని వాపోయాడు.