వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలనుండి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఐఎండీ భారీ వర్ష సూచన ఇచ్చిన నేపథ్యంలో అధికార యంత్రంగం అప్రమత్తుమైంది. శనివారం జిల్లాల కలెక్టర్లతో శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ఆమె చర్చలు జరిపారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని, అందుకే ప్రతీ జిల్లా కలెక్టర్ ఆఫీసుతో పాటు GHMC, రాష్ట్ర సచివాలయంలో కూడా కంట్రోల్ రూంలను తెరిచే ఉంచాలని ఆమె సూచించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలనుండి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
జిల్లాలో పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయితీ రాజ్ తదితర శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మ్యాన్ హోల్‌లను తెరవకుండా నిఘా ఉంచాలని శాంతికుమారి ఆదేశించారు.