దాదాపు 16 ఏళ్ల పోరాటం.. చివరకు వాళ్లకు ఓ అవకాశం వచ్చింది. అయితే దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టుగా ఉందీ వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినా, ఓ మంత్రి, అధికారుల
డీఎస్సీ 2008 అభ్యర్థులకు తీవ్ర అన్యాయం
కరీంనగర్ డీఈవో ఆఫీసులో అభ్యర్థుల ఆందోళన
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించినా దొరకని న్యాయం
అధికారుల మాయాజాలంతో ఉద్యోగులకు తీరని నష్టం
న్యూస్ లైన్ డెస్క్: దాదాపు 16 ఏళ్ల పోరాటం.. చివరకు వాళ్లకు ఓ అవకాశం వచ్చింది. అయితే దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టుగా ఉందీ వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినా, ఓ మంత్రి, అధికారుల కారణంగా డీఎస్సీ మెరిట్ లిస్టులో ఉండి కనీసం కాంట్రాక్టు ఉద్యోగానికి కూడా అర్హత సాధించలేకపోకపోయారు. తమ ఉద్యోగాలు అనర్హులకు వెళ్లిపోయాయంటూ కరీంనగర్ డీఈవో కార్యాలయంలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు అన్యాయం చేస్తున్న మంత్రి, అధికారులపై డీఎస్సీ 2008 అభ్యర్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కరీంనగర్ డీఈవో ఆఫీసులో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెరిట్ లిస్టులో తమకు అన్యాయం జరిగిందంటూ డీఎస్సీ 2008 మెరిట్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెరిట్ లిస్టులో ఉన్నవాళ్లను తొలగించి.. వేరే వాళ్లకు పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు ఇస్తామని ఇటీవలే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉండటం విశేషం. అయినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరిగింది.
2008 డీఎస్సీ అభ్యర్థులు .. అప్పుడు ఇచ్చిన పోస్టులలో 30శాతం డీఎడ్ వాళ్లకు ఇచ్చారు. దీనిపై కోర్టులకు వెళ్లడం.. అక్కడ స్టేలు రావడం.. వాటిపై ప్రభుత్వాలు నిర్ణయాలు సుదీర్ఘంగా ఎపిసోడ్ సాగుతూనే ఉంది. ఇంత జరిగినా బీఎడ్ వాళ్లకు క్వాలిఫైడ్ అయ్యి మెరిట్ లిస్టులో ఉన్నా జాబులు రాలేదు. 2010 నుంచి ఇప్పటి వరకు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే రేవంత్ సర్కార్ కొలువుదీరాక ఫిబ్రవరిలో డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది. దీనికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కామన్ మెరిట్ లిస్టును ఇటీవల ప్రకటించింది. అయితే అందులో ఉండాల్సిన అర్హులైన 13 మంది పేర్లు మాయం అయ్యాయి. కొత్తగా 16 మంది పేర్లు యాడ్ చేస్తూ కొత్త లిస్టును డీఈవో లిస్టులో పెట్టారు. దీంతో ఈ 13 మంది వారం రోజుల నుంచి డీఈవో ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిసి వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
అయితే డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో తాజాగా మరో లిస్ట్ అప్ లోడ్ చేశారు. అందులో పాత జాబితాలో ఉన్న ఐదుగురిని చేర్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పాత వాళ్లలో 8 మందిని పూర్తిగా పక్కన పెట్టేసి, ఇంకో 9 మందిని కొత్తగా యాడ్ చేశారు. దీంతో పాత లిస్టులో ఉన్న 8 మంది ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలు తమకు కాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ - 2008 అభ్యర్థులకు సంబంధించిన ఉపకమిటీలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నా.. తమకు న్యాయం జరగలేదని వాపోయారు. అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మైనార్టీ కోటా లిస్టుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ(ఇ) కేటగరీలో మైనార్టీలకు ఇవ్వాల్సిన ఒక పోస్టును హిందూ మహిళకు ఇచ్చారు. ఫిజికల్ హ్యాండికాప్డ్ కోటాలో కూడా అవకతకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.