కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన చేసి కోట్లు రూపాయల పెట్టుబడులను తెచ్చామని అన్నారు. తెలంగాణ ఉన్న యువతకు 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి అని అన్నారు. ఈ పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి అన్నారు. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్.. రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ ప్రభుత్వం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ అన్నారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.
కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చానాని, హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ ఐటీ అభివృద్ధిని కొనసాగించారు. సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు అన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందని అన్నారు. తమకు పోటీ ఏపీ, కర్ణాటకతో కాదని తమ పోటీ ప్రపంచంతో పక్క రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదన్నారు. పక్క రాష్ట్రాలతో తమకు పోటీ లేదని, హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.