డీ లిమిటేషన్
సౌత్ లిమిటేషనే
వివక్షపూరితతో దక్షిణాదికి నష్టమన్న జేఏసీ
దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతోందన్న స్టాలిన్
ఆదాయంలో అధిక వాటా సౌత్ దే..
కానీ డీలిమిటేషన్ తో మనకు అన్యాయం: కేటీఆర్
డీ లిమిటేషన్ పై బీజేపీని అడ్డుకోవాలి: రేవంత్ రెడ్డి
చెన్నైలు ముగిసిన సౌత్ రాష్ట్రాల జేఏసీ మీటింగ్
2వ సమావేశానికి వేదిక కానున్న హైదరాబాద్
తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్ పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ఆయా దక్షిణాది రాస్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రతినిధుల పేర్లను ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషలో నేమ్ ప్లేట్ పెట్టారు. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్లను తెలుగులో నేమ్ ప్లేట్ పై ముద్రించారు. అదే విధంగా కర్నాటక (కన్నడం), కేరళ (మళయాళం), పంజాబ్ (పంజాబీ) వచ్చిన ప్రతినిధులకు సైతం వారి స్థానిక భాషల్లో పేర్లను ముద్రించారు.
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 22): డీలిమిటేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు శనివారం సమావేశం అయ్యారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డీతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గుతోంది
డీ లిమిటేషన్ కారణంగా పార్లమెంట్ లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణాది నుంచి గొంతు వినిపించే వాళ్లు కూడా తగ్గిపోతారని ఆవేదన చెందారు. అంతేకాకుండా ఆయా రాజకీయ నిర్ణయాల్లో దక్షిణాది రాజకీయ నేతల అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్తు శ్రేయస్సుకు భంగం కలుగుతుందన్నారు. స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుందన్నారు.
బీజేపీని అడ్డుకోవాలి
సీఎం రేవంత్ మాట్లాడుతూ న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్ పై మనం బీజేపీని అడ్డుకోవాలన్నారు. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత బీజేపీ నేత వాజ్ పేయి కూడా లోక్ సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీ కూడా అదే పని చేయాలని, లోక్ సభ సీట్లు పెంచకూడదన్నారు. జనాభా ప్రతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించదని స్పష్టం చేశారు. దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశామని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలు కాలేదన్నారు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందున్నామని చెప్పుకొచ్చారు. దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ ఉండగా..తిరిగి వచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉందన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి..కేంద్రం ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమేనన్నారు. అదే బీహార్ రూపాయి పన్ను కడితే ..కేంద్రం ఇచ్చేది రూ. 6గా ఉందన్నారు. అదే తరహాలో ఉత్తరాదికి మరో రాష్ర్టం యూపీకి రూ.1కి, రూ.2.03 పైసలు వెనక్కి ఇస్తున్నారన్నారు.
మందబలంతో నియంతృత్వం రావొద్దు
మందబలం ఉన్నందువలన నియంతృత్వం రావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదని స్పష్టం చేశారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణను సాదించేందుకు అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలో 14 ఏండ్లపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని తెలిపారు. దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయన్నారు. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదన్నారు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుందన్నారు. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరాయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీజేడీ ప్రతినిధి సైతం హాజరయ్యారు. ఈ భేటీకి బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ దూరంగా ఉంది. అయితే ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీసీఎం జగన్ లు సైతం దూరంగా ఉన్నారు.
హైదరాబాద్ వేదికగా 2వ సమావేశం:
రెండో డీలిమిటేషన్ సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని స్టాలిన్ ప్రకటించారు. హైదరాబాద్ సమావేశం తర్వాత ఇక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామని స్టాలిన్ చెప్పారు. శనివారం చెన్నైలో జరిగిన మొదటి సమావేశంలో, డీలిమిటేషన్‌పై న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్టాలిన్ ప్రతిపాదించారు. అదే సమయంలో న్యాయమైన డీలిమిటేషన్ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకుందామని పిలుపునిచ్చారు.
ఆమోదించిన అంశాలు ఇవే
తొలి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశంలో నేతలంతా ఏకగ్రీవంగా ఏడు అంశాల తీర్మానాన్ని ఆమోదించారు. డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు, సంబంధిత వాటాదారులతో ఖచ్చితమైన సంప్రదింపుల తర్వాతే ఉండాలని జేఏసీ నొక్కి చెప్పింది.
ప్రజాస్వా్మ్యం స్వభావాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏదైనా లిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడాలి, అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరగాలి.
42, 84,87వ రాజ్యాంగ సవరణల ఉద్దేశం జనాభా నియంత్రణ చర్యల్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను రక్షించడం/ప్రోత్సహించడం. జనాభా స్థిరీకరణ లక్ష్యం ఇంకా సాధించబడినందున, 1971 జనాభా లెక్కల ఆధారంగా మరో 25 ఏళ్లు నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపచేయాలి.
జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన , తత్ఫలితంగా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలను శిక్షించకూడదు. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన రాజ్యాంగ సవరణలను అమలు చేయాలి.
పైన పేర్కొన్న సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా డీలిమిటేషన్ కసరత్తును చేపట్టడానికి చేసే ప్రయత్నాలను ఎదుర్కోవడానికి, జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్న రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో కూడిన కోర్ కమిటీ పార్లమెంటరీ వ్యూహాలను సమన్వయం చేస్తుంది.
ఎంపీల కోర్ కమిటీ పార్లమెంటరీ సమావేశంలో గౌరవనీయులైన భారత ప్రధానికి పైన పేర్కొన్న విధంగా ఉమ్మడి ప్రాతినిధ్యాన్ని సమర్పిస్తుంది.
సమావేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఈ అంశంపై తమ తమ రాష్ట్రాల్లో తగిన శాసనసభ తీర్మానాలను తీసుకురావడానికి ప్రయత్నాలను ప్రారంభిస్తాయ. వీటిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాయి.
సమన్వయంతో కూడిన ప్రజాభిప్రాయం సేకరణ వ్యూహం ద్వారా గత డీలిమిటేషన్ కసరత్తుల హిస్టరీ, సందర్భం, ప్రతిపాదిత డీలిమిటేషన్ పరిణామాలపై సమాచారాన్ని ఆయా రాష్ట్రాల పౌరులకు తెలియజేసేందుకు జేఏసీ అవసరమైన ప్రయత్నాలు చేస్తుంది.