వేటుకు వేళాయే.. సుప్రీం కోర్టులో కీలక వాదనలు


Published Feb 11, 2025 12:15:37 AM
postImages/2025-02-11/1739252978_WhatsAppImage20250211at11.09.29AM.jpeg

వేటుకు వేళాయే..!

 

స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం

రీజనబుల్ టైమ్ అంటే ఏంటంటూ మరోసారి ఫైర్

ఇప్పటికే 10 నెలలు గడిచాయన్న ధర్మాసనం

ఈ సమయం సరిపోదా అని మండిపాటు

టైమ్‌పై కమిట్ కాలేమన్న స్పీకర్ తరఫు న్యాయవాది

స్పీకర్ వేరే పనుల్లో ఉన్నారని దాటవేత

ఒక పనిలో ఉంటే మరో పని చేయలేమా అన్న సుప్రీం

తమ నిర్ణయంపై 3 రోజులు సమయం కోరిన ముకుల్ రోహత్గీ

ఈ నెల 18కి విచారణ వాయిదా వేసిన ధర్మాసనం

మరోవైపు దానం, కడియం వ్యవహారంపై ఆధారాలతో సహా

సుప్రీం దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరఫు న్యాయవాది

కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం

కూతురి తరఫున కాంగ్రెస్‌కు ప్రచారం చేసిన కడియం

 

 

 ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హతవేటు ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. రీజనబుల్ టైమ్‌పై స్పీకర్ ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్ని రోజులు టైమ్ కావాలంటూ స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైమ్ ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం కేసును ఈ నెల 18కి వాయిదా వేసింది.   

 

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 10): సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు ముందుకు తీసుకు వెళ్లడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫు న్యాయవాదులు సక్సెస్ అయ్యారు. వారి తీరును ధర్మాసనం ముందు ఎండగట్టారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీ టికెట్‌పై పోటీ చేయడాన్ని ఎత్తి చూపారు. అంతేగాక మరో ఎమ్మెల్యే .. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్న తన కూతురి తరఫున ప్రచారం చేయడాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్లారు. బీఆర్ఎస్ గుర్తులపై గెలిచి, కాంగ్రెస్ పార్టీతో ఎలా జట్టుకడతారని ప్రశ్నించారు. ఈ వాదనలను సుప్రీం కోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు సైతం తీవ్రంగా పరిగణించారు. బీఆర్ఎస్ తరఫున సి. ఆర్యమా సుందరం, దామశేషాద్రి నాయుడు, సి. మోహిత్ రావు వాదనలు వినిపించగా, అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్గీ వినిపించారు.

 

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారని దానం నాగేందర్‌ను ఉద్దేశించి కేటీఆర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కలుగజేసుకుని ఎమ్మెల్యేలపై అనర్హతకు రీజనబుల్ టైమ్ కావాలని మరోసారి అభ్యర్థించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామనితమకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని కోరారు. రోహత్గీ విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేయొద్దని, ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయని పేర్కొంది. తగిన సమయం అంటే ఏంటి? అని ప్రశ్నించింది. పార్టీ మారి పది నెలలు అవుతుందని, ఇది రీజనబుల్‌ టైం కాదా? అని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందిస్తూ..  సుప్రీం కోర్టు ఇచ్చిన టైం ప్రకారం.. రీజనబుల్‌ టైం అంటే మూడు నెలలే అంటూ బీఆర్‌ఎస్‌ తరుఫు న్యాయవాది తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

 

newsline-whatsapp-channel
Tags : supremecourt mla congress telanganam

Related Articles