ఢిల్లీలో ఆప్‌ను దెబ్బకొట్టాం!


Published Feb 10, 2025 12:02:47 PM
postImages/2025-02-10/1739169167_Revanth121Vjpg442x2604g.webp

ఢిల్లీలో ఆప్‌ను దెబ్బకొట్టాం!

నాడు హర్యానాలో మమ్మల్ని దెబ్బ తీసింది

మేం బీజేపీ గెలుపునకు కారణమయ్యాం

కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ

బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తుందన్న

వాదనకు బలాన్ని చేకూరుస్తున్న సీఎం వ్యాఖ్యలు

కూటమి మిత్రులను ఓడిస్తున్న కాంగ్రెస్ అంటూ విమర్శలు

 

బీజేపీ విజయాలకు కాంగ్రెస్ పరోక్ష కారణమన్న వాదనకు సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కూటమి పార్టీలను దెబ్బ కొడుతూ, బీజేపీ సక్సెస్‌లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఢిల్లీ ఫలితాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. హర్యానా, ఢిల్లీ అంశాలను ప్రస్తావిస్తూ, బీజేపీ విజయానికి ఎలా కాంగ్రెస్ ఎలా దోహదపడిందో ఆయన స్పష్టం చేశారు.

 

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 09): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆప్ కారణమైతే..  ఢిల్లీలో ఆప్‌ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణమైందని సీఎం అన్నారు. అక్కడ తమను ఆప్ దెబ్బకొట్టిందని, ఢిల్లీలో ఆప్‌ను తాము దెబ్బకొట్టామని చెప్పారు. ఇండియా కూటమిలో విబేధాల కారణంగా చివరకు బీజేపీ లాభపడుతోందని సీఎం అన్నారు. కేరళలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ఫలితాలపై స్పందించారు. ఇప్పుడు ప్రజలు కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఓట్లు వేస్తున్నారని, మూడో పార్టీకి స్థానం ఇవ్వట్లేదని సీఎం అన్నారు. గతంలో ఇలా ఉండేది కాదని తెలిపారు.

 

ఇక పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనేది అబద్దమని అన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని.. దానికి తానే సాక్ష్యమని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని, నీలం సంజీవరెడ్డి లాంటి వారిని రాష్ట్రపతి చేసిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. డీలిమిటేషన్ ప్రక్రియను సరైన పద్ధతిలో చేయాలని కోరారు. అలా చెయ్యకపోతే బీమారు రాష్ట్రాలు అయిన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని.. సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో  70 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ఆప్ కేవలం 22 స్థానాల్లో విజయం సాధించింది. 48 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అధికారం చేపట్టింది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురు కీలక నేతలు ఓటమి చెందడం గమనార్హం.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress bjp narendra-modi kerala

Related Articles