కాంగ్రెస్సే బీజేపీ బలం..!


Published Feb 10, 2025 11:49:06 AM
postImages/2025-02-10/1739168346_congressbjp1594835512.avif

కాంగ్రెస్సే

బీజేపీ బలం..! 

 

ఢిల్లీ ఫలితాలో మరోసారి తేటతెల్లం

జమ్మూ కశ్మీర్, మహారాష్ట్రలో..

ప్రాంతీయ పార్టీలకంటే పేలవ ప్రదర్శన

ఆప్ ను దూరం చేసుకోవడంతోనే..

గెలిచే హర్యానాలో కాంగ్రెస్ కు ఓటమి

కూటమి పార్టీల మీదనే కాలుదువ్వుతున్న వైనం

వెస్ట్ బెంగాల్ తో టీఎంసీతోనూ కయ్యమే

యూపీలో ఎస్పీతో కూడా అంతంత మాత్రమే

ఏపీలో పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీ సహకారం

ఎన్నికల ముందు రాష్ట్రంలో బలమైన..

నాయకత్వాన్ని మార్చేసిన కమలం పెద్దలు

 

 

 ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీదే ఏకచ్ఛత్రాధిపత్యం. అటు రాష్ట్రాల్లో .. ఇటు పార్లమెంట్‌లో ఆ పార్టీకి తిరుగే లేదన్నట్టుగా ఉండేది. 80వ దశకం చివరి వరకు ఆ పార్టీ ఆడిందే ఆట.. పాడిందే పాట. ఓ మహా సముద్రంలాంటి కాంగ్రెస్ నేడు రోజురోజుకూ బలహీనపడుతూ పిల్ల కాలవను తలపిస్తోంది. కూటమిగట్టినా, ఒంటరిగా పోరాటం చేసినా.. ఏ రాష్ట్రంలోనూ ప్రభావం చూపలేకపోతోంది.  బలమైన ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తూ, తాను ఓడిపోతూ.. వారినీ ఓడిస్తూ.. బీజేపీ గెలుపునకు సహకరిస్తుందన్న విమర్శలను మూటగట్టుకుంది. కాషాయం పార్టీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ కర్త, కర్మ, క్రియ అయ్యింది. ఏ ఎన్నికలొచ్చినా కమల దళాన్ని ఢీకొట్టలేక చతికిలపడుతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ఇప్పుడొక సాదాసీదా పార్టీగా మారింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.  

 

తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 09): స్వాతంత్ర్యానికి ముందు పుట్టి, దశాబ్దాల పాటు స్వతంత్ర భారతాన్ని ఏలిన కాంగ్రెస్ నేడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో నమ్మకాన్ని పొందలేక, ప్రధాన ప్రత్యర్థి బీజేపీని ఓడించలేక జాతీయ రాజకీయాల్లో నామమాత్రపు పాత్రను పోషిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల ఏలుబడిలో వరుస విజయాలను అందుకున్న ఆ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి నేడు ఆపసోపాలు పడుతోంది. ఒకప్పుడు ఏపీ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో చరిత్రాత్మక విజయాలను సొంతం చేసుకోగా.. నేడు ఆయా రాష్ట్రాలలో ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని హీనస్థితికి చేరుకుంది. మోడీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీని దీటుగా ఎదుర్కోలేకపోతోంది. కనీసం కూటమిగానైనా చెప్పుకోతగ్గ విజయాలను అందుకోలేకపోగా, ఆయా పార్టీల విజయావకాశాలను దూరం చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.

 

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలమైన షాక్ ఇచ్చింది. కమలం పార్టీకి చావుదప్పి కన్ను లొట్టబోయినంత పని అయ్యింది. అయితే ఇదే స్ఫూర్తిని ఇండియా కూటమికి నేతృత్వం వహించిన కాంగ్రెస్.. తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించలేకపోయింది. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్‌గఢ్ ఇలా ఏ రాష్ట్రం తీసుకున్నా.. అక్కడ బీజేపీని గెలిపించడానికే కాంగ్రెస్ పని చేసిందన్న విమర్శలు ఉన్నాయి. జార్ఖండ్, జమ్ముకశ్మీర్ లాంటి ఒకటి రెండు రాష్ట్రాలను మినహాయిస్తే పెద్దగా ఫలితాలను కాంగ్రెస్ రాబట్టలేకపోయింది. అక్కడి ప్రాంతీయ పార్టీలకంటే కూడా తక్కువ సీట్లు తెచ్చుకుని పరువు పోగొట్టుకుంది. ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను సీట్ల పంపకాల పేరుతో చికాకు పెట్టి, కూటమి లక్ష్యాన్ని నీరుగార్చి చివరకు దారుణ పరాజయాలను మూటగట్టుకునేలా చేసిందన్న వాదనలు కూడా ఉన్నాయి. కూటమి పార్టీలతో సఖ్యతగా మెలుగుతూ, ఓ పెద్దన్న పాత్రను పోషిస్తూ విజయాలను సాధించాల్సిన కాంగ్రెస్.. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇండియా కూటమిలో హస్తం పార్టీ భస్మాసురహస్తాన్ని తలపిస్తోంది. ఢిల్లీలో కూటమి మిత్రుడైన ఆప్‌ను ఓడించడంలో కాంగ్రెస్ చేసిన కృషి దీన్నే సూచిస్తోంది. హస్తం పార్టీ కుతంత్రాలతో అక్కడ వరుసగా మూడోసారి సున్నా సీట్లకే పరిమితం అయ్యింది. 15 ఏళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కూటమి పార్టీలపైనే కాలుదువ్వే వ్యవహార శైలితో హర్యానాలో ఆప్‌‌ను దూరం చేసుకుంది. దీంతో పక్కాగా గెలుస్తుందనుకున్న హర్యానాను కాంగ్రెస్ కోల్పోయింది. సీట్ల పంచాయతీయే దీనికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. 

 

రెండు సీట్లతో జాతీయ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన బీజేపీ నేడు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితికి చేరుకుంది. రాష్ట్రాల్లో బలం లేని సమయంలో ఆయా ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకుంటూ, వారి సాయంతో గెలుస్తూ, నేడు ఏకంగా సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి ఆర్ఎస్ఎస్ పెద్దల వ్యూహం, కార్యకర్తల బలం ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. కాంగ్రెస్ నేడు ఆ రెంటినీ కోల్పోయింది. పైపెచ్చు తమ లక్ష్యం కూడా ఏంటో తెలియని స్థితిలో ఉంది. స్థానికంగా ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తూ వారికి కూడా విజయాలను దక్కకుండా చేస్తోంది. ఢిల్లీలో ఆప్ ఓటమికి కాంగ్రెస్ వైఖరే కారణం. తాను ఓడిపోయినా ఫర్వాలేదు.. ఆప్ మాత్రం గెలవొద్దన్నట్టుగా వ్యవహరించి బీజేపీకి విజయం దక్కేలా చేసింది.

 

ఇదే తరహాలో కాంగ్రెస్ ఉంటే, ఎన్నటికీ బీజేపీని ఓడించలేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కాంగ్రెస్ వ్యవహారశైలిని గ్రహించిన మమతా బెనర్జీ, నితీశ్ లాంటి వాళ్లు ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. మొదట్లో ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఉన్న నితీశ్ స్వల్ప కాలంలో దాన్నుంచి బయటకు రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ తనదైన వ్యూహంతో వెళుతున్నారు. కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలో సఖ్యంగా ఉంటున్నా.. స్వరాష్ట్రంలో మాత్రం ఆ పార్టీని దూరం పెడుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగానే 42 స్థానాల్లో పోటీ చేసి 29 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌తో ఉంటే తమ గెలుపు కష్టమనే ఆలోచనల్లో ప్రాంతీయ పార్టీల నాయకులు ఉండడంతో ఆ పార్టీ రోజురోజుకు పలచబడుతూ, బీజేపీని కట్టడి చేయలేని స్థితికి చేరుకుంది. ఇక యూపీలోనూ సమాజ్ వాదీ పార్టీ సొంతంగానే అడుగులు వేస్తోంది. ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుకి పరోక్షంగా కాంగ్రెస్ సహకరించించదన్న చర్చ నాడు జరిగింది. అక్కడ అధికాంలో ఉన్న జగన్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ, టీడీపీపై విమర్శలకు దూరంగా ఉంది. దీంతో అక్కడ తను ఒక్కసీటు గెలవకపోయిన ప్రత్యర్థులకు మాత్రం సహకరించింది.

 

అయితే తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ సహకరించడం విశేషం. స్థానిక బలమైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌ను ఓడించడానికి రెండు పార్టీలు లోపాయికార ఒప్పందంతో పనిచేశాయన్న చర్చ జరిగింది. అప్పటికే మంచి ఊపుమీద ఉన్న బీజేపీ, ఒక్కసారిగా బలమైన నాయకత్వం అందిస్తున్న బండి సంజయ్‌ను మార్చి, కిషన్ రెడ్డికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో సీన్ మొత్తం మారిపోయింది. దీంతో ఎవరూ ఊహించని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా పొత్తు అంశంలో రాష్ట్రానికో లెక్క ఉండడంతో వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ నేడు ఓ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress bjp narendra-modi

Related Articles