వాస్తు పిచ్చి నెత్తికెక్కింది..!
పాలన పడకేసింది..!
సచివాలయంలో రేవంత్ సర్కార్ తరీఖా..!
సెక్రటేరియట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి అంతే
లక్కీ నెంబర్ ఆధారంగా ముఖ్యమంత్రి పాలన
ఆరో అంతస్థు నుంచి 9వ అంతస్థుకు సీఎంవోను మార్చేందుకు యత్నం
తూర్పు నుంచి ఈశాన్యానికి ప్రధాన మహాద్వారం మార్పు
వచ్చి, వెళ్లే దారుల్లోనూ మార్పులు
వీటికి కోసం దాదాపు రూ.3.20 కోట్లు కేటాయింపు
కాన్వాయ్‌లో 9వ నెంబర్‌కు ప్రాముఖ్యత
అడుగడుగునా వాస్తును పాటిస్తున్న సీఎం
సీఎంతో పాటు మంత్రులదీ అదీ దోవ!
ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా బంగారం లాంటి సచివాలయాన్ని వాస్తు పేరుతో చెడగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తు విషయంలో గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తాను అదే వాస్తు పేరుతో రకరకాల మార్పులు చేర్పులు చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తు పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోపక్క నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రాచఠీవీతో ఉండే రాష్ట్ర సచివాలయంపై విషం గక్కుతుండటం విమర్శలకు దారితీస్తుంది. వాస్తు పేరుతో మార్పులు చేస్తూ.. ఏకంగా నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రేకెత్తించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం అండ్ కో సచివాలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు.
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 13): పాలనలో సత్ఫలితాల కోసం సీఎం రేవంత్ రెడ్డి వాస్తును నమ్ముకున్నారని, తనపై ప్రజావ్యతిరేకతను తగ్గించుకోవడానికి వాస్తుశాస్త్రంలోని పుస్తకాలను తిరగేస్తున్నారన్న సెటైర్లు ఏడాది కాలంగా వినపడుతున్నాయి. సచివాలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టినప్పటి నుంచి పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేపట్టారు. మొదట సీఎం కార్యాలయం, ఆ తర్వాత ప్రధాన ద్వారంపై ఫోకస్ పెట్టారు. ఒక్కోదాన్ని మార్చుతూ సీఎం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తన అదృష్టసంఖ్య తొమ్మిది కావడంతో దానికి తగ్గట్టుగా 6వ అంతస్థులో ఉన్న సీఎం కార్యాలయాన్ని 9వ అంతస్థులోకి మార్చాలనుకున్నారు. దానిలో భాగంగానే 9వ అంతస్థులో సీఎంవోను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పలు కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. దీనికి అధికారులు కూడా నో చెప్పినట్టుగా తెలుస్తుంది. నిర్మాణపరంగా, భద్రతపరంగా సాధ్యం కాదని చెప్పడంతో మార్పు ఆలోచనను విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధాన మహాద్వారం నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తూర్పుదిశగా ఉన్న మహా ద్వారాన్ని ఈశాన్యం వైపునకు మార్చారు. అంతేగాక ఆగ్నేయం వైపున ఉన్న గేటు నంబర్-2 నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఉన్న గేటు నంబర్-4 వరకు నేరుగా వెళ్లేలా రహదారిని ఏర్పాటు చేశారు. దాదాపు రూ.3.20 కోట్లను ఈ పనులకు కేటాయించారు. దీంతో సీఎం వచ్చి, వెళ్లే మార్గాలు మారాయి. అంతేగాక సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా చేపట్టిన వాస్తు మార్పులతో సచివాలయానికి జరుగుతున్న డ్యామేజ్‌ను కవర్ చేసుకోవడానికి ఏకంగా నిర్మాణ నాణ్యతపైనే సందేహాలు కలిగేలా వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే నిర్మాణ పనుల కారణంగానే సచివాలయం ఐదో అంతస్థు నుంచి పెచ్చులూడాయన్నది అసలు నిజమని, నిర్మాణలోపం కానేకాదని ఏకంగా నిర్మాణ సంస్థే ప్రకటించింది. శాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో కీలక అంశాలను తెలిపింది. సెక్రటేరియట్‌లో గత కొన్ని నెలలుగా సచివాలయం 5వ, 6వ అంతస్థుల్లో మరమ్మత్తులు, మార్పులు కొనసాగుతున్నాయని, ఐదో అంతస్థులో పనిచేస్తున్న సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పెచ్చులు ఊడిపోయాయని తెలిపింది. రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ పనులలో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం మరమ్మతులు జరుగుతున్నాయని ప్రకటనలో పేర్కొంది. ఇది నిర్మాణ సమస్య కాదని, కాంక్రీట్ వర్క్‌కు సంబంధం లేదని, ఊడిపోయింది జీఆర్సీ ఫ్రేమ్ మాత్రమేనని తెలిపింది. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని, స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుందని, ఎలాంటి నాణ్యత లోపం లేదని తేల్చి చెప్పింది.
కాన్వాయ్‌లోనూ మార్పులు..!
సీఎం కాన్వాయ్ కూడా జ్యోతిష్యాన్ని బట్టే మారింది. తెలుపు కార్లను తొలిగించి, నలుపు రంగు కార్లు తెచ్చిపెట్టారు. రేవంత్ అదృష్ట సంఖ్య 9 అని, కాన్వాయ్‌లో 9 కార్లు, వాటి నంబర్ ప్లేట్లపై 9 అంకె వచ్చేలా చూసుకున్నారన్నది సమాచారం. ఈ జ్యోతిష్యమే సచివాలయంలో భారీ మార్పులకు కారణమైంది. తూర్పువైపు మహాద్వారం, ఈశాన్యం వైపునుకు మారింది. మొదట్లో తూర్పు నుంచి రేవంత్ రాకపోకలు సాగించగా, సత్ఫలితాలు రాకపోవడంతో.. జూన్‌లో ఆ గేటును మూసివేశారు. పశ్చిమం గేటు ద్వారా రాకపోకలు ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈశాన్యానికి మారారు. ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయమేగాక, మంత్రుల ఛాంబర్లలోనూ వాస్తు మార్పులు చేపట్టడం విశేషం.