ముఖ్యమంత్రిని..
నా మాటే ఎవ్వరూ వింటలేరు!
నాకు మస్తు అసంతృప్తి ఉంది
పొద్దున్న రమ్మంటే సాయంత్రం దాక వస్తలేరు
నేను ఢిల్లీ పోతే ఎంపీలు హైదరాబాద్ వస్తుర్రు..
హైదరాబాద్ వస్తే వాళ్లు ఢిల్లీ పోతుర్రు
మంచి చెవిలో చెప్తుర్రు.. చెడు మైకులో చెప్తుర్రు
ఇట్లయితే మనం ఫెయిల్ అయితం
పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్(ఫిబ్రవరి 28): పార్టీలోని ప్రస్తుత పరిణామలపై గాంధీభవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సీఎం అయినా చెప్పింది చెప్పినట్లు నడుస్తలేదన్న అసంతృప్తి తనకుందని వాపోయారు. తన మాట ఎవ్వరూ వినడం లేదని, తాను చెప్పింది జరగడం లేదన్న వ్యాఖ్యలు చేశారు. తాను పొద్దున రమ్మంటే సాయంత్రం వస్తున్నారని నేతలపై నవ్వుతూనే సెటైర్లు వేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపైనా ఆయన విమర్శలు చేశారు. తాను ఢిల్లీ పోతే హైదరాబాద్ వస్తుండని, తాను హైదరాబాద్ వస్తే ఢిల్లీ పోతుండని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయంటూనే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ అజెండా అంటూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 80 శాతం వరకు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదవులు రాని వాళ్లు నిరాశ చెందవద్దని.. మరో విడతలో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్యాడర్‌పై ఒకింత సీరియస్ అయ్యారు. పార్టీ కోసం పనిచేయకపోతే కార్పొరేషన్ చైర్మన్లకు పదవిగండం తప్పదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని తొలగించడమే కాకుండా.. రెన్యూవల్ కూడా చేయబోమని తేల్చి చెప్పారు. వారికి ఇదే చివరి పదవి అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు వచ్చిన వారు, పదవులు రాని వారికి మధ్య గ్యాప్ ఉంది.. కార్యకర్తల మధ్య గ్యాప్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని అన్నారు. ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
అలాగే మంచి మైకులో చెప్పాలని, చెడు చెవిలో ఊదాలని పెద్దలు ఊరకే అనలేదన్నారు. కానీ మనవాళ్లు చెడు మైకులో చెప్పి, మంచి చెవిలో ఊదుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకు వెళ్లడంలో విఫలమయ్యారని సుతిమెత్తగా క్లాస్ పీకారు. అంతేగాక కూర్చున్న దగ్గరే పదవులు రావని, ఎవరో కొందరికి లక్కీ లాటరీలు తగిలినట్టు పదవులు వస్తాయని, కానీ అందరికీ అలా రావన్న ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరికి పోయి, పాదయాత్ర చేస్తున్నాడని, మనం కూర్చున్న దగ్గరి నుండి కదలం అంటే కుదరదని రేవంత్ రెడ్డి అన్నారు.
కిషన్ రెడ్డిపై మరోసారి సీరియస్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. మోడీ భజన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం బిహార్, యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడంలేదని అన్నారు. కిషన్‌రెడ్డి వల్లే మెట్రో, మూసీ ఆగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రకే బినెట్‌లో పెట్టకుండా మిగతా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రావడం లేదు.. రూపాయి కడితే 42 పైసలు మాత్రమే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది.. అక్కడ మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. బీసీ కులగణన జరిగితే అధికారం పోతుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఏనాడైనా తెలంగాణ ప్రాజెక్ట్ కోసం ప్రధానిని కలిశారా? అని అడిగారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’
- మీనాక్షి నటరాజన్
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కీలక సూచనలు చేశారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, వారికి న్యాయం జరగాలన్నారు. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలన్నారు. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కులగణన చేపట్టాం.. ఇది చాలా గొప్ప విషయం అని అభినందించారు. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు. గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు. ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా క్యాలెండర్ సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.