ఇప్పటికే పలు మార్లు తెలంగాణ భవన్‌లో, ఇటీవల జరిగిన రైతు నిరసన సభల్లో ఆయన రుణమాఫీపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రుణమాఫీ అంశంపై ఆయన మరోసారి స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఢిల్లీ యాత్రలు పక్కన పెట్టి ఛలో 'పల్లె' చేపట్టాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ జరగకపోవడంతో లక్షలాది రైతులు ఆందోళన చెందుతుంటే.. సీఎం మాత్రం ఢిల్లీ యాత్రలకు తిరుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే పలు మార్లు తెలంగాణ భవన్‌లో, ఇటీవల జరిగిన రైతు నిరసన సభల్లో ఆయన రుణమాఫీపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రుణమాఫీ అంశంపై ఆయన మరోసారి స్పందించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే.. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 20 సార్లు ఢిల్లీకి వెళ్లారని అయన తెలిపారు. రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..?? అని కేటీఆర్ ప్రశ్నించారు. 20 సార్లు ఢిల్లీకి వెళ్లి వస్తే తెలంగాణకు దక్కింది 'గుండు సున్నా' మాత్రమే అని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు.. గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని వెల్లడించారు.
అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం మెచ్చుకోవడం కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతులకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు కనిపిస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ గల్లీల్లో ఉండాలని ఢిల్లీలో కాదని తెలిపారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యమని కేటీఆర్ హెచ్చరించారు.