తాను జీవ సమాధి అయ్యేటప్పుడు ఎవరూ చూడరాదని తమ తండ్రి చెప్పాడని, అందుకే తాము ఎవరికీ చెప్పలేదని వెల్లడించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కేరళలో ఓ వ్యక్తి జీవ సమాధి అయినట్టు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఆ వ్యక్తి పేరు గోపన్ స్వామి . తిరువనంతపురానికి చెందిన గోపన్ స్వామి జీవ సమాధిలోకి వెళ్లారంటూ ఆయన కటుంబ సభ్యులు ప్రచారం చేశారు. పోస్టర్లు కూడా వేయించారు. దీంతో తమ చుట్టాలకు అనుమానం వచ్చి పోలీసులకు తెలియజేశారు. దీనిపై గోపన్ స్వామి కుమారులు రాజేశన్, సనందన్ స్పందిస్తూ... తాను జీవ సమాధి అయ్యేటప్పుడు ఎవరూ చూడరాదని తమ తండ్రి చెప్పాడని, అందుకే తాము ఎవరికీ చెప్పలేదని వెల్లడించారు.
తిరువనంతపురంలోని నెయ్యటింకర వద్ద ఉన్న ఓ దేవాలయం సమీపంలో గోపన్ స్వామి జీవ సమాధి అయినట్టు కుటుంబ సభ్యులు చెప్పగా.... ఆ సబ్ కలెక్టర్ పోలీసుల సాయంతో ఆ ప్రదేశానికి వెళ్లారు. ఆ సమాధిని తవ్వుతుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దేవునికి తనను తను అర్పించుకున్న తన తండ్రి శవాన్ని ఇలా బయటకు తియ్యడం బాలేదంటూ కుటుంబసభ్యులు గొడవపడ్డారు.
దాంతో, హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న అధికారులు... భారీగా పోలీసులను రంగంలోకి దింపి తవ్వకం కొనసాగించారు. సమాధి లోపల కూర్చుని ధ్యానం చేస్తున్న స్థితిలో గోపన్ స్వామి మృతదేహం కనిపించిందని, సమాధిలో ఆయన ఛాతీవరకు పూజా సామగ్రితో నింపారని పోలీసులు వెల్లడించారు. కాగా, గోపన్ స్వామి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.