రాష్ట్రంలో మరో రైతు ఆత్మహత్య
ఎండిన పంట చూసి తట్టుకోలేక సూసైడ్
పెట్టుబడి కోసం అప్పులు తెచ్చిన రైతు
అప్పు తీర్చలేక మనస్థాపంతో ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లాలో ఘటన
తెలంగాణం, ముస్తాబాద్ (ఫిబ్రవరి 24) : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. సాగు నీళ్లు అందక ఎండిన పంటను చూసి తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన రైతు జెల్లా దేవయ్య (51) అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం పొలం వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. సొంతంగా ఎకరం పొలం ఉండగా పక్కనే ఉన్న 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో వరి పంట సాగు చేస్తున్నాడు. అయితే పెట్టిన పంటకు సరిపడ నీళ్లు అందకపోవడంతో పంట అంతా ఎండిపోయింది. దీంతో తట్టుకోలేక, అప్పుల బాధ ఎలా తీరుతాయని తెలియక మనస్థాపానికి గురై దేవయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.