ఎమ్మెల్సీ ఎన్నికల్లో..
ఓడిపోయినా పర్వాలేదు
నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు
సన్న వడ్లకు రూ.500 బోనస్ తీసుకున్నోళ్లు..
రూ.500కు గ్యాస్ వచ్చినోళ్లే ఓటేయండి
రుణమాఫీ కానోళ్లు..రైతుబంధు రానోళ్లు..
మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు
ప్రతి నెల ఫస్ట్‌కే జీతాలు ఇస్తున్నాం
మేం చెప్పేది అబద్దమైతే ఓటేయకండి
ఎమ్మెల్సీ ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణం, బ్యూరో (ఫిబ్రవరి 24) : ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు, ఓటములతోని ప్రభుత్వ మనుగడకు ఏం ప్రమాదం లేదని, ఎమ్మెల్సీగా నరేందర్ గెలిచినా ఓడిపోయినా తన ప్రభుత్వానికి ఏం నష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతలుకు రూ.2లక్షల రుణమాఫీ చేసింది నిజమైతే, రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.6వేలు పడింది.. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చింది వాస్తవమైతే, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది నిజమైతేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. తాను చెప్పింది ఏ ఒక్కటి అబ్దమైన ఓటు వేయాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అని, జీతాలు పడలేదంటే ఓటు వేయొద్దన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రూ.8వేల కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. బెనిఫిట్స్ కోసం బిడ్డ పెండ్లి కార్డు పట్టుకొని ఒకరు, కిడ్నీ వ్యాధి వచ్చిందని ఒకరు వస్తున్నారన్నారు. ప్రస్తుతం ఇచ్చే స్థోమత ప్రభుత్వం దగ్గర లేదని అన్నారు. అవసరమైతే రాబోయే సంవత్సరంలో నెలకు రూ.1000 కోట్లు చెల్లిస్తానని, తన మీద నమ్మకం ఉంటేనే ఓటేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55వేల ఉద్యోగాలు ఇచ్చామని, 35వేల మంది టీచర్లను బదిలీ చేశామని, 25వేల మందికి ప్రమోషన్లు కల్పించామన్నారు. ఇది చేసింది నిజమని నమ్మితేనే ఓటు వేయాలన్నారు.
కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారని అన్నారు. వాళ్లకు ఏ హక్కు ఉందని నిధులు అడుగుతున్నారని ప్రశ్నించారు. మాకు చెప్పకుండా బీజేపీ కేంద్ర మంత్రులను కలిసి నిధులు ఎందుకు అడుగుతారని అన్నారు. ప్రభుత్వంలో తామే ఉన్నామని, తామే అడుగుతామని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ చిల్లి గవ్వ తేలేదన్నారు. కనీసం బీసీ లెక్కలు కూడా తేల్చలేదన్నారు. రాష్ట్రంలో బీసీల లెక్కలు పక్కాగా తేల్చమన్నారు. కులగణనలో తప్పు ఉంటే చూపించాలని, సొల్లు కబుర్లు చెప్పొద్దన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51శాతం ఉంటే మేం 56శాతం ఉందని చెప్పామని ఇది పెరిగినట్టా, లేక తగ్గినట్లా చెప్పాలన్నారు.
యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని, టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి రూ.2కోట్ల ప్రోత్సాహక నగదు అందజేశామని, క్రికెటర్ సిరాజ్‌కు ఎన్నో మినహాయింపులతో గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని గుర్తు చేశారు. పారా అథ్లెట్ జివాంజీ దీప్తికి రూ.25లక్షలు, ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు.
ఉప ఎన్నికలు ఎలా వస్తాయ్..?
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో ఉప ఎన్నికలు రానిది ఇప్పుడు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అప్పుడు ఉన్న స్పీకరే ఇప్పుడు ఉన్నారని, అప్పుడు ఉన్న కోర్టులే ఇప్పుడు ఉన్నాయని, అలాంటప్పుడు అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.