ఇంకా స్పష్టత రాలేదు : SLBC


Published Feb 26, 2025 12:08:54 PM
postImages/2025-02-26/1740551934_OrangealertissuedIMDHyderabadwarnsofveryheavyrains14.jpg

ఇంకా స్పష్టత రాలేదు 
శిథిలాలు తొలగిస్తేనే SLBC టన్నెల్‌‌పై స్పష్టత
బురదను తొలగించేందుకు ప్రయత్నాలు
రేపటి సాయంత్రంలోగా బురద తొలగింపు
నేడు రంగంలోకి ఎన్‌జీఆర్‌ఐ, బీఆర్‌వో నిపుణులు
పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
సర్వశక్తులను ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్

తెలంగాణం, నాగర్‌కర్నూల్(ఫిబ్రవరి 25): నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్‌ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా కార్మికుల ఆచూకీ కోసం యావత్ రెస్క్యూ టీమ్ నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉంది. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నిత్యం పరిశీలిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మంగళవారం ర్యాట్‌ మైనర్ టీంను రంగంలోకి దింపారు. ఉదయం 10 గంటలకు లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్ళారు. ఈ రిస్క్ ఆపరేషన్‌ను రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట నీటి ఊట మరింత పెరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. ఎనిమిది మంది మైనర్లు చిక్కుకున్న ప్రదేశంలో సుమారు ఐదు మీటర్ల బురద ఉందని అంచనా వేశారు. సొరంగం లోపల విద్యుత్ పునరుద్ధరించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే, సహాయ బృందాలు టార్చి లైట్ల సాయంతో లోపలికి జనరేటర్ తీసుకువెళ్లారు. ప్రమాదం జరిగిన చోటును గుర్తించి అక్కడ శిథిలాల తొలగింపు పూర్తయితే తప్ప పరిస్థితి ఏంటి అనేది అంచనా వేయలేమని రెస్క్యూ ఆపరేషన్‌ బృందం సభ్యులు చెబుతున్నారు. 

టన్నెల్‌లో 10,000 క్యూబిక్ మీటర్లు బురద

ప్రస్తుతం టన్నెల్​లో 10,000 క్యూబిక్ మీటర్లు బురద ఉందని అధికారులు తెలిపారు. ఈ బురద నీటిని బయటికి తీయడం సవాలుగా ఉందన్నారు. కన్వేయర్ బెల్ట్​కు మరమత్తులు జరుగుతున్నాయని, ఈ కన్వేయర్ బెల్ట్​కు ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోగా మరమత్తులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా బురదను బయటికి తీయ వచ్చన్నారు. వీటిని మరింత త్వరిత గతిన వెలికి తీయడానికి అక్కడికి వెళ్లగలిగే జేసీపీలను తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టన్నెల్​లో గంటకు 3600 నుండి 5000 లీటర్ల ఊట నీరు వస్తుందని తెలిపారు. లోపలి నుంచి నీటితో పాటు, బురదను కూడా బయటికి తీయడానికి ఒకే పైప్ లైన్ వినియోగించనున్నామని స్పష్టం చేశారు.

సర్వ శక్తులు ఒడ్డుతున్నాం: మంత్రి ఉత్తమ్

దేశంలోనే ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేయాల్సిన పనులు అన్నీ చేస్తున్నామన్నారు. వారి ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని, ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, ఆర్మీ, జీఎస్‌ఐ ఇలా 10 సంస్థలకు చెందిన నిపుణులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నేడు ఎన్‌జీఆర్‌ఐ, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ నిపుణులు రానున్నారని వెల్లడించారు. గంటకోసారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారన్నారు. ఎస్ఎల్‌బీసీ సహాయ చర్యలపై విమర్శలను తప్పుబట్టిన మంత్రి ఉత్తమ్‌ చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలిపారు. సీనియర్‌ మంత్రులం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే, ఎస్ఎల్‌బీసీ ప్రమాద సంఘటనా స్థలాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మంగళవారం పరిశీలించారు. స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం ప్రాజెక్ట్ స్థలంలోని జేపి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సహాయ కార్యక్రమాల తీరును సమీక్షించారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy telanganam uttamkumarreddy bhattivikramarka

Related Articles