యూరియా దొర్కతలేదు
ఎరువుల కోసం అన్నదాతల అరిగోసలు
చెప్పులు, పాస్ పుస్తకాలతో క్యూలైన్
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు
దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్నలు
రోజులు తరబడిగా ఎదురు చూపులు
‘‘ రాష్ట్రంలో మళ్లీ ఆనాటి రోజులొచ్చాయ్. ఎక్కడ చూసినా యూరియా బస్తాలు దొరకడం లేదు. అడపదడప వచ్చినా అవి ఏ రైతుకు సరిపోవడం లేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్టాక్ వస్తుందన్న ఆశతో పొద్దు పొడవకముందే పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. పొద్దంతా ఎదురు చూసినా చేతికి ఎరువుల బస్తాలు అందకపోవడంతో తీవ్ర నిరాశతో ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. సరిపడ యూరియాను ప్రభుత్వం అందుబాటులో పెట్టలేకపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘
తెలంగాణం, బ్యూరో (ఫిబ్రవరి 24) : రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సరిపడ ఎరువులు దొర్కపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నప్పటికీ అధికారులు సరిపడ స్టాక్ తెప్పించకపోవడంపై మండిపడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో ఎరువులు దొరక్క రైతులు బారులు తీరారు. ఏకంగా పోలీసుల పహారాలో టోకెన్ల పద్ధతిలో సరఫరా చేశారు. ఈ ఘటన తర్వాత సరిపడ బస్తాలు తెప్పిస్తామని అధికారులు చెప్పినప్పటికీ, రోజులు గడుస్తున్నా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో రైతులు ఎరువుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘంలో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. అయితే వచ్చిన స్టాక్ కొంత మందికి మాత్రమే రావడంతో మిగితా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు సరిపడ ఇవ్వకపోతే వ్యవసాయం ఎలా చేయాలంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోవైపు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం, మల్లాపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం పాస్ బుక్కులు లైన్లో ఉంచి రైతులు బారులు తీరారు.
యూరియా సరఫరాలో సర్కార్ ఫెయిల్: హరీష్ రావు
మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే, నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి పరిస్థితి వచ్చిదంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరావృతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న రైతన్నను ఇప్పుడు నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమని విమర్శించారు. రైతు డిక్లరేషన్ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంట నీరు పెట్టిస్తున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.