గృహజ్యోతి బంద్ ?
ఉచిత కరెంట్ కు ఎండాకాలం ఎఫెక్ట్
200 యూనిట్ల విద్యుత్‌కు కోతపడే ఛాన్స్ ?
సమ్మర్‌లో పెరుగుతున్న కరెంటు వాడకం
ఒక్క యూనిట్ పెరిగిన మొత్తం బిల్లు చెల్లించాల్సిందే
ఇదే అదునుగా సర్కార్ కొత్త ఎత్తుగడ..!
200 యూనిట్లు దాటిన వారిని...
ఈ పథకం నుంచి పూర్తిగా తొలగించే అవకాశం...!
‘‘రేవంత్ రెడ్డి సర్కార్ పథకాల్లో కోతలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇప్పటికే చేతులు ఎత్తేసిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఉన్నవాటిలోనూ కోతలు పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా మొదట గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంటులో కోతలు పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.‘‘
తెలంగాణం, బ్యూరో (ఫిబ్రవరి 28) : కాంగ్రెస్ ప్రభుత్వం.. కోతల ప్రభుత్వంగా మారుతోంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్న రేవంత్ సర్కార్, ఇప్పుడు మరో పథకానికి ఎగనామం పెట్టనున్నట్లు తెలుస్తోంది. గృహజ్యోతి పథకంలో భాగంగా ఇస్తున్న 200 యూనిట్లు ఉచిత విద్యుత్ లో కోతలు పెట్టాలని భావిస్తోంది. రానున్న మూడు, నాలుగు నెలల్లోనే ప్రస్తుతం ఉన్న వినియోగదారులను భారీగా తగ్గించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రకటించింది సర్కార్. దీని కోసం ప్రతి నెల దాదాపు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం, ఈ పథకంలోని అర్హుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. దీని కోసం ఈ సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో దాదాపు అన్ని ఇండ్లల్లో కరెంటు వాడకం పెరిగిపోతోంది. ఎండాకాలం కావడంతో ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు వాడేస్తుంటారు. దీంతో గత నెల వరకు వాడిన కరెంటు కంటే రానున్న ఈ మూడు నెలలు దాదాపు డబుల్ అవుతోంది. దీంతో చాలా కుటుంబాలు 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడేస్తారు. దీన్ని సర్కార్ అదునుగా తీసుకోనుంది. 200 యూనిట్లు కరెంటు దాటిన ప్రతి ఇంటిని ఈ పథకం నుంచి తప్పించేలా ప్రయత్నాలు సాగుతున్నాయనే చర్చ నడుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక స్థోమతను అంచనా వేయకుండా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. దాదాపు ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చింది. ప్రధానంగా వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు సైతం ఏడాదిన్నర కాలం కావొస్తున్న పూర్తిగా అమలు చేయలేకపోతోంది. ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసినా ఇప్పటికే చాలా మంది అర్హులకు సైతం అందడం లేదు. వీటి అమలుకు ప్రతి నెల ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతోంది. దీంతో ఒక్కో పథకంలో ఉన్న అర్హులను సైతం తగ్గించాలని భావిస్తోందని సమాచారం. దీనిలో భాగంగా మొదట గృహజ్యోతి పథకం కింద చాలా మందిని తొలగించనున్నట్లు సమాచారం.
గృహజ్యోతితో పాటు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలకు సైతం కోతలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణానికి కూడా కోతలు పెడతారనే టాక్ వినిపిస్తోంది.