బ్యాగులు మోయొద్దు
లాబీయింగ్ చేయొద్దు..!
పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ స్పష్టం
సంచులు మోయడం మానేయండి
పని చేస్తేనే పార్టీలో పదవులు
గులాంగిరీలు, లాబీయింగులు పక్కనపెట్టండి
సీరియస్ గా క్లాస్ పీకిన రాహుల్ దూత
మీనాక్షి వార్నింగ్ తో ఆలోచనలో పడ్డ ఓ వర్గం
పదవులు వస్తాయని ఇప్పటికే లాబీయింగులు
కాంగ్రెస్ అంటే మార్క్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ రాకతో వ్యక్తిపూజలకు చెక్ పెట్టింది. దీంతో ఇప్పటి వరకు పదవులు రాక నిరాశతో ఉన్న కాంగ్రెస్ వర్గాల్లో కొత్త జోష్ వచ్చింది. మరోవైపు మీనాక్షి రావడంతో ప్లెక్సీ రాజకీయాలకు చెక్ పెట్టారు. పేద ప్రజల లక్ష్యంగానే పార్టీ నేతలు పని చేయాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కొత్త బాస్..మీనాక్షి నటరాజన్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 01): కాంగ్రెస్ అంటేనే జోకుడు బ్యాచ్ గా పేరుంది. దేశ స్వాతంత్ర్యకోసం పోరాటం చేసిన పార్టీగా ప్రజల్లో పేరున్నా..తెలంగాణలో మాత్రం ఒక సామాజిక వర్గం కబంధ హస్తాల్లో పార్టీ బందీ అయిందనేది కాదనలేని వాస్తవం. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా ..వచ్చిన మీనాక్షి నటరాజన్ తన మార్క్ రాజకీయాలను షురూ చేశారు.వ్యక్తిగత భజనలు, ప్లెక్సీలు, హంగులు ఆర్భాటాలకు ఆస్కారం లేదని తేల్చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో మీనాక్షి నటరాజన్ ఆసక్తిగా మారారు. తాను సాధారణ మనిషి అని చెప్పడానికే శుక్రవారం హైదరాబాదులో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశం కోసం హైదరాబాద్ వచ్చిన తీరు ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచారు. రైల్లో వచ్చారు. ర్యాలీలు లాంటివి చేయడం తనకు ఇష్టం ఉండదని.. అలాగే.. కాన్వాయ్ కూడా అవసరం లేదన్నారు. దాంతో రైల్లో కాచిగూడ వచ్చిన ఆమెను పీసీసీ చీఫ్ ఓ పది మంది నేతలతో కలిసి రిసీవ్ చేసుకుని గాంధీభవన్ కు తీసుకెళ్లారు.సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ తరపున ఇంచార్జ్ గా కొత్తవారు వస్తున్నారంటే.. ముందుగా వారిని కాకా పట్టే బ్యాచ్ ఒకటి ఆమెను కలిసి బోకేలు ఇచ్చి పరిచయాలు పెంచుకుని వచ్చేవాళ్లు. కానీ అలాంటి వాటికి ఆమె కనీసం ఎక్కడ చోటు ఇవ్వలేదు. రైల్లో వచ్చారు. ర్యాలీలు లాంటివి చేయడం తనకు ఇష్టం ఉండదని.. అలాగే.. కాన్వాయ్ కూడా అవసరం లేదన్నారు. దాంతో రైళ్లో కాచిగూడ వచ్చిన ఆమెను పీసీసీ చీఫ్ ఓ పది మంది నేతలతో కలిసి రిసీవ్ చేసుకుని గాంధీభవన్ కు సాదాసీదాగా తోడ్కొని తీసుకెళ్లారు. అయితే మీనాక్షి నటరాజన్ చూడటానికి సింపుల్ గా కనిపిస్తారు. కానీ ఆమె కఠినంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలు. అందుకే రాహుల్ గాంధీకి ఆమెపై మంచి అభిప్రాయం ఉంది. రాహుల్ తమ టీమ్ లో కీలక బాధ్యతలు మీనాక్షి నటరాజన్ కు ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకూ ఇంచార్జ్ గా పని చేసిన దీపాదాస్ మున్షి.. హై క్లాస్ లీడర్. ఆమె హైదరాబాద్ లో ఓ పెద్ద బంగళా అద్దెకు తీసుకుని సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన ప్రయోజనాలూ పొందారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకునేవారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో అలాంటి ఆడంబరం ఒక్కటి కూడా లేదు.
ఇక పప్పులుడకవ్..!
- మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు చాలా స్పష్టమైన సందేశాన్ని ఎంట్రీలోనే ఇచ్చారు. కాకా పట్టే లీడర్లకు అవకాశమే ఉండదని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఫ్లెక్సీ లీడర్లకు కూడా ముందుగానే వార్నింగులు వెళ్లాయి. కాకాలు పట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అది మైనస్ అవుతుందని తెలియడంతో చాలా మంది ఫ్లెక్సీలు పెట్టలేదు. పార్టీ కోసం పని చేసే వారికి మాత్రమే మీనాక్షి నటరాజన్ ప్రాధాన్యం ఇస్తారని క్లారిటీ ఉండటంతో అందరూ తాము పార్టీ కోసం ఏం చేశామో చెప్పుకు నేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె కూడా.. ఏం పని చేయాలో కాంగ్రెస్ నేతలకు స్పష్టంగానే చెప్పారు. ఇక వ్యక్తి పూజలకు ఆస్కారం లేదని..అందరూ ప్రజల కోసమే పని చేయాలని..ఇక ఎలాంటి పప్పులుడకవ్ అనే రీతిలో తన వ్యవహార శైలీని ప్రదర్శించింది. ఇంత కాలం పదవుల భర్తీ కాలేదు. ఆరు మంత్రి పదవులతో పాటు పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీనంతటికి కారణం దీపాదాస్ మున్షినేనని చెబుతారు. ప్రతీ దానికి ఆమె సీఎం రేవంత్ చెప్పే దానికి భిన్నంగా నివేదికలు ఇవ్వడంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయిందని కాంగ్రెస్ శ్రేణుల్లో అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ నిక్కచ్చిగా ఉంటారు. ఏదో ఒకటి తేల్చేస్తారు. అందుకే పదవులు వస్తాయని కాంగ్రెస్ నేతలు కూడా బోలెడు ఆశలు పెంచుకున్నారు.