రీల్స్ సర్కార్ !
జనంలో కంటే రీల్స్‌లోనే ఎక్కువ
డిప్యూటీ సీఎం, మంత్రులది అదే దారి
వైరల్ అవుతోన్న సీతక్క, కోమటిరెడ్డి బ్రదర్స్ రీల్స్
విమర్శల పాలవుతున్న నేతల తీరు
హైలెట్‌బాక్స్: ప్రజల్లో ఉండాల్సిన ప్రభుత్వం.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఉంటోందన్న చర్చ జరుగుతోంది. నిత్యం ప్రజాసమస్యలపై పోరాడాల్సిన నాయకులు రీల్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఓ ఇన్‌స్టా రీల్ చేసుకోవడం వారికి పరిపాటయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేసుకుంటున్న వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తమదైన ముద్రవేసేందుకు, ఇన్ ఫ్ల్యూయన్సర్లను తదన్నేలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 28): ప్రజలు అధికారం ఇచ్చింది ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడానికే అన్నట్టుగా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రీల్స్ సర్కార్ అన్న విమర్శలను మూటగట్టుకుంటోంది. క్యాబినెట్‌లో నెం.2గా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ మధ్య ఏ కార్యక్రమానికి వెళ్లినా ఓ మాంచి బీజీఎం పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆఖరుకి ఎస్ఎల్‌బీసీ ఘటనకు సంబంధించిన రివ్యూ మీటింగ్ విజువల్స్‌ను కూడా ఇలా ఇన్ స్టా రీల్స్‌లా పోస్ట్ చేయడం విమర్శలకు దారితీసింది.
ఇక మంత్రి సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్స్ అక్క అంటూ ఆమెపై విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గిరిజన గూడేల్లోకి ప్రజాసేవ చేయడానికి వెళ్లి రీల్స్‌కు ఫోజులు ఇచ్చారన్న విమర్శలను సీతక్క మూటగట్టుకున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదలి రీల్స్ అక్క డీజే టిల్లు పాటకు డాన్స్ చేశారని నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఈ మధ్య రీల్స్ టీమ్‌లో జాయిన్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. అన్నదమ్ములు ఇద్దరూ ఒకరిని మించి ఒకరు రీల్స్ షో చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమను తాము షో చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షికార్లు చేస్తూ, సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేసుకున్నారంటూ జిల్లావాసులు మండిపడుతున్నారు.
ఈ రీల్స్ కోసం ప్రత్యేకంగా కెమేరామెన్లు, ఎడిటర్లను నియమించుకోవడం రాజకీయ నాయకులకు సర్వసాధారణం అయిపోయింది. నెలకో రెండు మూడు లక్షలు వీటికే తగలేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎవరో అభిమానులు వీడియో ఎడిట్స్ చేసుకుని గ్రూపులలో షేర్ చేయడం వేరని, కానీ, నాయకులే రీల్స్ కోసం ప్రత్యేకంగా టీమ్స్‌ను నియమించుకోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.