ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యకుంటే..
ఓట్లు అడగం !
ఇండ్లు ఇచ్చిన ఊర్లలోనే పోటీ చేస్తం
నన్ను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలదే
మోడీ, కేసీఆర్ పాలనపై నేను చర్చకు సిద్ధం
నేను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా
మేం అధికారంలోకి వచ్చాక కొడంగల్ ప్రాజెక్ట్ చేపట్టాం
జిల్లా అభివృద్ధికి ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తా
బడ్జెట్ నుంచి కేటాయించడానికి రెడీగా ఉన్నా
నారాయణపేట జిలా బహిరంగ సభలో సీఎం రేవంత్
తెలంగాణం, నారాయణపేట(ఫిబ్రవరి 21): రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంవత్సరంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని పేర్కొన్నారు. శుక్రవారం నారాయణపేట్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యని ఊర్లల్లో ఓట్లు అడగమని సంచలన ప్రకటన చేశారు. ఏ ఊర్లో తాము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో ఆ ఊర్లోనే పోటీ చేస్తామని, ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో అక్కడే బీఆర్ఎస్ పోటీచేయాలని సవాల్ చేశారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని బయలుదేరి తనపై కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని.. పనులు చేసే బాధ్యత తనదని.. తనను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. పదేళ్లు అధికారంలోకి ఉండి కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో.. పన్నెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ, ఏడాదిలోనే తామేం చేశామో చర్చించడానికి తాను సిద్ధమన్నారు. ప్లేస్, డేట్ చెబితే తాను సిద్ధమన్నారు. చర్చలో తాను ఓడిపోతే అక్కడే ముక్కు నేలకు రాస్తా అన్నారు. ఏడాదిలో తాము చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రం చేయలేదన్నారు.
పదేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే.. ఇవాళ ఏపీతో గొడవ ఉండేదే కాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టామని అన్నారు. తాము పాలమూరు పచ్చబడేలా పనులు చేస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు పాలమూరు ప్రజలే రాజకీయ భిక్ష పెట్టారని.. అయినా ఏమాత్రం విశ్వాసం లేకుండా పదేళ్లు పాలమూరును ఎండబెట్టారని సీరియస్ అయ్యారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే.. పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.
రుణమాఫీ పూర్తికాలే: పర్ణికా రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
రుణమాఫీ అసంపూర్తిగానే అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. అందరికీ అయిపోయిందంటూ రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటుంది. ఏ వేదిక ఎక్కినా 100 శాతం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ చెబుతుంటారు. అయితే సొంత పార్టీ నేతలే రుణమాఫీ పూర్తి కాలేదని అసలు వాస్తవాలను బయటపెడుతుండటం గమనార్హం. శుక్రవారం నారాయణపేట నియోజకవర్గంలో సీఎం పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి రుణమాఫీ పూర్తి కాని విషయాన్ని వేదికపై చెప్పారు. నియోజకవర్గంలో రూ.200 కోట్ల రుణమాఫీ అయ్యిందని, ఇంకా రూ.50 కోట్లు జరగాల్సి ఉందని ఆమె స్వయంగా చెప్పారు.
జిల్లా కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తా!
అంతకుముందు నారాయణపేట్ మెడికల్ కాలేజ్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్ర బడ్జెట్ నుండి ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చుపెడుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంతైనా కావొచ్చని, ఎన్ని వందల వేట కోట్లు అయినా ఈ జిల్లాను అభిృద్ధి పరచడానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయిస్తానన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు.
గురుకులాలలో చదివి.. ఎంబీబీఎస్ సీటు
గురుకులాలలో చదివి ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థిని సత్యజ్యోతి మాట్లాడుతూ తన సంతోషాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పంచుకుంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన సత్యజ్యోతి.. తమ తండా నుంచి మొదటి ఎంబీబీఎస్ విద్యార్థిని తానేనని పేర్కొంది. తాను ఐదో తరగతి నుంచి గురుకులాల్లో చదువుతున్నానని, గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతానో లేదో అనుకునేదాన్ని అని, నేడు దాన్ని సాకారం చేసుకున్నానని ఆమె తెలిపింది. దీంతో ముఖ్యమంత్రితో సహా మంత్రులు అంతా ఆమెను కరతాళ ధ్వనులతో అభినందించారు. ఇదిలా ఉంతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించాక కేసీఆర్ ప్రభుత్వంలో పెద్దఎత్తున గురుకులాలను ప్రోత్సహించింది. అంతేగాక మెడికల్ కాలేజీలను కూడా భారీగా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఎంబీబీఎస్ వైపుగా అడుగులు వేయడానికి అవకాశం ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.