నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి!
భూగర్భజలాలు లేవు.. బోర్లు వేయకండి
కరువు అనేది ప్రకృతి విపత్తు
రైతులకు కోసం చేయాల్సిందంతా సీఎం చేసిండు
రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ అన్నీ ఇచ్చిండు
యాసంగి పంటలు వేసి నష్టపోవద్దు
రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
యాసంగి పంటల పనుల్లో ఉన్న రైతులకు పిడుగులాంటి వార్త చెప్పారు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి. బోర్లు వేయొద్దు, అప్పుల పాలు కావొద్దు అంటూ ఆయన రైతులను హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అన్నదాత దేశానికి వెన్నెముక అంటూనే వరి వేసుకోవద్దంటూ ఆయన సూచించడం చర్చకు దారి తీసింది. భూగర్భజలాలు పడిపోతున్నాయని రైతు కమిషన్ చెప్పడం, సాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని, జలాశయాల్లో నీటిని కాపాడుకుంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 21): వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. భూగర్భజలాలు లేవని, బోర్లు వేయొద్దని హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరువు అనేది ప్రకృతి విపత్తు,
సీఎం రేవంత్ రెడ్డి రైతులకు కోసం చేయాల్సిందంతా చేసిండని, రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ అన్నీ ఇచ్చిండని, యాసంగి పంటలు వేసి నష్టపోవద్దని, అప్పులు పాలు కావొద్దని కోదండి రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయన్నారు.
రైతులే ఈ దేశానికి వెన్నెముక అని.. రైతుల ప్రాణం చాలా విలువైనదని కోదండ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ఉన్నామన్న ఆయన, సాధారణంగా మార్చి తరువాతనే ఎండలు ముదురుతాయని, కానీ అలాంటి పరిస్థితికి భిన్నంగా ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయన్నారు. ఎండల తీవ్రత వలన.. పంటలు ఎండిపోతున్నాయని.. దాంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అప్పులు చేసి బోర్లు వేయొద్దన్నారు. కమిషన్ ఎప్పుడూ రైతాంగం అభివృద్ధి చెందాలనే చూస్తుందన్నారు. ఉన్న పంటలను కాపాడుకోవాలని, అదనంగా వరి వేయొద్దని సూచించారు.