సొమ్ములు పాయే
పదవులు రాకపాయే
కొంపముంచిన దీపాదాస్ మున్షీ..?
తీవ్ర నిరాశలో కాంగ్రెస్ నేతలు, ఆశావహులు
ఎంపీ టిక్కెట్ కు రూ.100 కోట్లు ఢీల్..!
అడ్వాన్స్ గా రూ.20 కోట్లు పుచ్చుకుందని టాక్..!
శివగామిగా మారిన దీపాదాస్
ఇదే నా మాట..నా మాటే శాసనం..
అంటూ కాంగ్రెస్ ను శాసించిన మున్షీ..?
‘‘తన మాటే శాసనమంట..తన మాటే వేదం అంట.తను చెప్పిందే చెయ్యాలంటా..ఎవరైనా’’..తన పేరే శివగామంట.. తన తీరే వేరంట..తన పేరే చెబితే ఎవరైనా హడలే హడలంట..‘‘ఇదే నా మాట..నా మాటే శాసనం’’ అంటూ బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అచ్చం రమ్యకృష్ణ పోషించిన పాత్ర..తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో దీపాదాస్ మున్షీ రోల్ శివగామిని తలపిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా దీపాదాస్ మున్షీ నియామకం అయిన నాటి నుంచే వెళ్లిపోయే వరకు ఆమె అనేక శాసనాలు చేసి వెళ్లిందనే టాక్. టికెట్ల కేటాయింపు నుంచి పార్టీలో చిన్న పదవులు దక్కాలన్నా దీపాదాస్ మున్షీ ఆశీర్వాదం ఉండాలంతే.లేదంటే గుండు సున్నా..అనేరీతిలో ఆమె కీ రోల్ పోషించిందని ప్రచారం జరుగుతోంది..!.
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 2): తెలంగాణలో మాజీ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షి మరో శివగామిలా మారిందా..? నేను చెప్పిందే వేదం...చేసిందే శాసనం అన్నట్లు వ్యవహరించారా,,? ... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనాల్లోంచి వచ్చిన నాయకుల కంటే డిల్లీ నుండి వచ్చిన ఆమె పెత్తనమే ఎక్కువ య్యిందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రభుత్వానికి సమాంతరంగా మరో పవర్ సెంటర్ గా మారేందుకు ఆమె ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా పార్టీ ప్రయోజనాలకోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే ఆమె పనిచేసే వారని... ఇది గుర్తించిన కాంగ్రెస్ అదిష్టానం సాగనంపినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతలను మాజీ కేంద్రమంత్రి దీపాదాస్ మున్షీకి అప్పగించింది. 2023 లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, దీపాదాస్ కాంగ్రెస్ ఇంచార్జీగా నియామకం ఒకేసారి జరిగాయి. అయితే ఎలాగూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈమెకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది... దీంతో పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శివగామి పాత్రను పోషించిన దీపాదాస్ భారీగా సంపాదించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
చివరకు దీపాదాస్ పెత్తనం ఏ స్థాయికి చేరిందంటే... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం తెలియకుండా పార్టీలోకి నాయకులను చేర్చుకున్నారట. ఇలా సీఎంనే లెక్కచేయని ఆమె ఇతర నాయకులను లెక్కచేస్తుందా. ఇలా ఆమె ఓవరాక్షన్ ఎక్కువ కావడంతోనే కాంగ్రెస్ నాయకులు అదిష్టానానికి ఫిర్యాదులు చేశారని సమాచారం. దీంతో తెలంగాణ ఇంచార్జీ బాధ్యతల నుండి ఈమెను తప్పించినట్లు తెలుస్తోంది.
గాంధీ కుటుంబాన్నే నమ్ముకొని కాంగ్రెస్ జెండాను మోసిన అసలైన నేతలను పక్కకు నెట్టి, జెండాలు మార్చిన వలస నేతలు రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నుంచి వచ్చిన ఏపీ జితేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి గెలిచి గోడ దూకిన అరెకపూడి గాంధీ, గుత్తా అమిత్‌రెడ్డికి వెంటనే పదవులు దక్కడంలో శివగామి దీపాదాస్ మున్షీపాత్రనే కీలకంగా మారిందనేది సమాచారం. టీడీపీ నుంచి వలస వచ్చిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేయడంపై..అప్పట్లో పాత కాంగ్రెస్ నేతలు భగ్గుమన్న విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి, అసెంబ్లీ టికెట్లు త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఏఐసీసీతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయ కమిటీ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక వలస వాదుల పెత్తనం పెరిగి తమను కరివేపాకును తీసినట్టు తీసివేస్తున్నారనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఆప్పట్లో ఆవేదన వ్యక్తం చేసిన విషయం విధితమే.
రూ.100 కోట్లకు డీల్.. రూ.20 కోట్లు అడ్వాన్స్..!:
-మెదక్ ఎంపీ సీటు కోసం రూ.100 కోట్ల డీల్..నీలం మధు, దీపాదాస్ మున్షీకి మధ్య జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ముందుగా రూ.20 కోట్లను అడ్వాన్స్ గా నీలం మధు నుంచి దీపాదాస్ మున్షీ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే తర్వాత ఎన్నికల ఫలితాల్లో నీలం మధు ఘోర పరాజయం కావడంతో ..ఆ డీల్ కాస్తా మధ్యలోనే ఆగిపోయిందనేది సమాచారం. నీలం మధుకు టికెట్ కట్టబెట్టిన సమయంలో దీపాదాస్ మున్షీని ..మధు గెలవడని సీనియర్ నేతలు మొత్తుకున్నా..వినకుండా..ఆమె టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఎంపీగా ఓడిపోయినప్పటికీ నీలం మధుని మంత్రిని చేసేందుకు దీపాదాస్ శతవిధాల ప్రయత్నించారని సమాచారం. టికెట్ తో సహా కొన్ని ల్యాండ్ వ్యవహారాల విషయంలో సైతం నీలం మధుకు ఫేవర్ చేస్తానని కాంగ్రెస్ శివగామి మున్షీ..తన మాటే శాసనమనే రీతిలో హామినిచ్చారంట. అయితే చివరికీ దీపాదాస్ స్థానంలో మీనాక్షి నటరాజన్ రాకతో సదరు కాంగ్రెస్ నేత పరిస్థితి సొమ్ములు పాయే..పదవులు రాకపాయే విధంగా మారిందని ప్రచారం జరుగుతోంది. నీలం మధు ప్లెక్సీల్లో దీపాదాస్ మున్షీ ఖచ్చితంగా ఉండేవారని టాక్. ఈ ఘటనతో ఎఫెక్ట్ తోనే..ప్రస్తుత కాంగ్రెస్ బాస్ మీనాక్షి నటరాజన్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో ప్లెక్సీలు వద్దని ఖరాఖండిగా చెప్పడం వెనుక అంతరార్థం ఉందనే ప్రచారం సాగుతోంది.ఎందుకంటే అప్పట్లో గాంధీభవన్ తో పాటు నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో నీలం మధు ప్లెక్సీలు మాత్రమే కనిపించేవి.