నా పాలన అద్భుతం
జనం మస్త్ సంతోషంగున్నరు
నేను మాట ఇస్తే తప్పేదే లేదు
రైతులందరికీ రైతుభరోసా వచ్చింది
రూ.2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది
రైతులకు 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్న
క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చిన
రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నం
200 యూనిట్ల ఫ్రీ కరెంటు కూడా ఇస్తున్నం
కూలీలకు రూ.12 వేలు ఇచ్చినం
విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చిన
ఏడాదిలో 55,143 ఉద్యోగాలిచ్చి చరిత్ర సృష్టించినం
నేను మాట చెప్పి ఎగ్గొట్టే వ్యక్తిని కాదు
ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ దే
కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు..
ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే
మొగిలిగద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణం, హైదరాబాద్ (జనవరి 31): కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రంలోని 4కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు పడడటం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ రాష్ట్రానికి రైతులు వెన్నుముక అన్నారు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన ఓ రైతు బిడ్డగా 60 రోజుల్లోనే 25లక్షల 50వేల మందికి రూ.2లక్షల చొప్పున రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. కేసీఆర్ రైతుబంధు ఏడాదికి రూ.10వేలు ఇస్తానంటే నేను రూ.15వేలు ఇస్తానని చెప్పి రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా వచ్చిందని, రుణమాఫీ జరిగిపోయిందని, క్వింటాలుకు రూ.500 బోసన్ వేశామని, 24గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. నేను మాట ఇస్తే ఎగ్గొట్టే వ్యక్తిని కాదని, ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు.
నిరుద్యోగులకు ఏడాదిలోనే 55143 ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టించిందన్నారు. కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేనిదే ఏడాదిలోనే ఇచ్చామన్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం రూ.500 కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించామన్నారు. పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని బడ్జెట్ లో రూ.21వేల కోట్లు కేటాయించి ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నట్లు చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులు కడతామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, పాలమూరును ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ ఆరోపించారు. టిక్ టాక్‌లో పెట్టిన పోలింగ్ లో ఎక్కువ లైకులు వచ్చాయని కేసీఆర్ చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రజలు తిరస్కరించారు కాబట్టే ఫాంహౌస్ కే పరిమితం అయ్యారన్నారు. బలంగా కొడ్తానంటున్న కేసీఆర్, ముందు కర్రలేకుండా సరిగ్గా నిలబడడం నేర్చుకో అంటూ మాట్లాడారు. కేసీఆర్ ఓ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు అని, ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకు పోవాల్సిందే అందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభలోనే ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే రిపోర్టును ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
గద్దర్ జయంతి వేడులకు సీఎం
రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి గద్దర్ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్ రచించిన మా పల్లె, ప్రతి పాటకు కథ ఉంది పుస్తకాలను ఆవిష్కరించారు.