జనం గోస పడ్తుర్రు
తెలంగాణను ఆగం చేస్తుర్రు
అన్నీ చూస్తున్న మన బలమేందో చూపిద్దాం..!
ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెట్టుకుందాం
మబ్బు పోతుంది, ప్రజలకు అర్థమవుతుంది
రైతు భరోసా ఇస్తడో ఇయ్యడో దేవుడికి ఎరుక
అప్పుడే కరెంటు కోతలు, నీటి బాధలు
గురుకులాల్లో పిల్లలు బాధపడుతున్నరు
తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే
అందరికీ న్యాయం జరిగే వరకు కొట్లాడాలి
తెలంగాణకు రక్షకులం మనమే
ప్రజలు మనల్నే కోరుకుంటున్నారు
కాంగ్రెస్ పోలింగ్‌లోనూ మనకే మెజార్టీ
తెలంగాణ శక్తి ఏందో చూపించాలి
నేను కొడితే మామూలుగా ఉండదు
జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్
‘‘ మౌనంగా ఉన్నా.. రాష్ట్రంలోని పరిస్థితులను గంభీరంగా చూస్తున్నాను. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. నమ్మి ఓట్లేసిన జనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కొంత టైం ఇద్దామని ఇన్నాళ్లు చూశాను. ఏడాది దాటినా ప్రభుత్వ తీరులో మార్పు రాలేదు. కరెంటు కోతలు, నీటి బాధలు, గురుకులాల్లో విద్యార్ధుల అవస్థలు.. ఇక సంహించేది లేదు. ప్రజల తరపున కొట్లాడాల్సిందే. తెలంగాణ శక్తి ఏందో చూపించాల్సిందే. లేదంటే ఇంకా ఘోరం జరిగేలా ఉంది. న్యాయం జరగాలంటే ఎవరూ కొట్లాడే వాళ్లు లేరని, మనమే కొట్లాడాలలన్నారు. ప్రాణం పోయిన తెలంగాణకు రక్షకులం మనమే అంటూ పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.‘‘
తెలంగాణం, హైదరాబాద్ (జనవరి 31) : రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఇంట్లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా గంభీరంగా చూస్తున్నానన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చూశానని, ఏడాది సమయం దాటిపోయినా మార్పు రాలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు కాలేదని, కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ సగానికి సగం పడిపోయిందని, కాగ్ రిపోర్టు ప్రకారం ఇప్పటికే రూ.13వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు. ఇంకో 4 నెలలు అయితే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదన్నారు. ఇలాగే వదిలిపెడితే రాష్ట్రం నాశనం అవుతుందని, అందుకే కొట్లాడాలని పిలుపునిచ్చారు. పార్టీలు గెలుస్తాయ్.. ఓడిపోతాయ్ కానీ ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
అప్పుడప్పుడు చెడు గడియలు వస్తాయని, అత్యాశకు పోయి మంది మాటలు నమ్మి మోస పోయామని ప్రజలకు అర్థం అవుతుందన్నారు. మబ్బులు వీడుతుంటే ప్రజలకు ఒక్కొక్కటిగా తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే అమాంతం మింగుతుందని, రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జై భీం అంటారని చెప్పినా ఎవరూ వినలేదన్నారు. తులం బంగారంకు ఆశపడిపోయి బావిలో పడ్డట్లే అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవడో ఏదో చెబితే నమ్మి ఓట్లు వేస్తే ఏమౌతుందనేది ఇది తెలంగాణకు మంచి గుణపాఠం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయానికి రైతుబంధు పడితే అంతా సంతోషంగా ఉండేవాళ్లని, ఇపుడు ఇస్తడో ఇయ్యడో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలని గురుకులాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాటిని అద్వాన్నంగా మార్చారని మండిపడ్డారు. రోజు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని, పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు భయపడి ఇప్పుడు గురుకులాల నుంచి పిల్లలను తీసుకుపోతున్నారని చెప్పారు.
ఎండాకాలం మొదలు కాకముందే అప్పుడే కరెంటు కోతలు, నీటి బాధలు మొదలయ్యాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటి గురించి ఎవరైనా నిలదీస్తే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎవరి పాలన బాగుందో పోలింగ్ పెడితే మనకి 75శాతం ఓటింగ్ వచ్చిందని, ప్రజలు మనల్ని కోరుకుంటున్నారని చెప్పారు. న్యాయం జరగాలంటే పోరాటం చేయాల్సిందే అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే అని, కులం, మతం అవసరం లేదననారు. అందరికీ న్యాయం జరగాలంటే ఎవరూ కొట్లాడేవాళ్లు లేరని, మనమే కొట్లాడాలని సూచించారు. తెలంగాణకు రక్షకులం మనమే అని, ప్రాణం పోయినా తెగించి కొట్లాడాల్సిందేఅని పిలుపునిచ్చారు. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదన్నారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.