ఎండుతున్న తెలంగాణ..!


Published Mar 06, 2025 11:02:31 AM
postImages/2025-03-06/1741239151_WhatsAppImage20250306at10.36.33AM.jpeg

ఎండుతున్న తెలంగాణ..!

వట్టిపోయిన బోర్లు.. అడుగుతేలిన బావులు
కాల్వల్లో నీళ్లివ్వని రేవంత్ సర్కారు
చివరి తడి కోసం రైతుల తండ్లాట
వేల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు
చేతికొచ్చే పరిస్థితి లేక పశువులకు మేతగా వరి
సూర్యాపేట, సిరిసిల్లలో ఎండిన పైరులు
యాదాద్రి జిల్లాలోనూ పశువుల మేతగా మారిన వైనం
కరీంనగర్ జిల్లాలో మళ్లీ కనిపిస్తున్న పూడికతీతలు
నిజామాబాద్, నల్గొండలో ఎండిపోయిన బోర్లు
పెట్టుబడి నష్టపోయామంటున్న అన్నదాతలు
నీళ్ల ప్రణాళికలో విఫలైన రాష్ట్ర ప్రభుత్వం
పంటలు వేయొద్దని ఫిబ్రవరి చివరలో ప్రకటించిన ప్రభుత్వం


రాష్ట్రంలో నిజంగానే ఆనాటి రోజులు వచ్చాయి. దశాబ్దకాలం క్రితం రైతులు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మళ్లీ కన్నీరు పెట్టిస్తున్నాయి. వేసవి ముదరక ముందే పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి.. బావుల్లో నీరు లేక.. కాలువల్లో నీళ్లు రాక.. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. బంగారం లాంటి పంటలతో రైతుల ఇంట సిరులు నింపాల్సిందిపోయి పశువులకు మేతగా మారుతున్నాయి. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి  కనిపిస్తోంది.  

తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 5) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేసవి ప్రారంభంలోనే సాగునీటికి నానా తిప్పలు పడుతున్నారు. సాధారణంగా వరిపైరుకు ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. అయితే.. గతంలో యాసంగి పంటకు కూడా నీళ్లు వచ్చాయి. కాబట్టి ఈ సారి నీళ్లు కూడా వస్తాయన్న ధీమాతో చాలా మంది రైతులు పెద్ద మొత్తంలో వరి సాగు చేశారు. ఇతర ఆరుతడి పంటలు కూడా వేశారు. కానీ సరిగ్గా వరి పొట్టదశకు వచ్చిన సమయంలో నీటి కటకట మొదలైంది. వరి ధాన్యం నాణ్యంగా ఉండాలంటే ఈ సమయంలోనే నీరు సరిగా అందించాలి. లేకపోతే గింజ బరువు లేకపోవడం, తాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి. రైతు కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని గుర్తించడం లేదు. రైతులకు అత్యంత ముఖ్యమైన సమయంలో సాగు నీరు ఇవ్వకుండా తిప్పలు పెడుతోంది. దీంతో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండినట్టుగా తెలుస్తోంది. నీరు లేక పొలాలు నెర్రెలు బారాయి. అయినా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. రైతులకు సకాలంలో నీరు అందించడం లేదు. 

యాసంగిలో తగ్గిన వరి సాగు..!
యాసంగిలో సాగునీటి కొరత ప్రభావం వరిసాగుపై భారీగా పడింది. నాగార్జునసాగర్‌తో పాటు కడెం, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌, కాళేశ్వరం అనుసంధాన ప్రాజెక్టుల నుంచి అవసరమైన సాగునీళ్లు అందుబాటులో లేకపోవడంతో వరిసాగు భారీగా తగ్గింది. గతంతో పోల్చితే మొత్తం 7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. అందులో వరి సాగే ఏకంగా 6 లక్షల ఎకరాల్లో తగ్గడం గమనార్హం.

వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు..
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో భూగర్భజలాల మట్టం చాలా వరకు తగ్గిపోయింది. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లో పతనమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్లకు పడిపోయింది. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల రోజుల వ్యవధిలోనే ఒక మీటరు వరకు క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. దీంతో చాలా కాలం తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూడికతీత క్రేన్లు దర్శనమిస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు నీళ్ల కోసం చివరి ప్రయత్నంగా రైతులు బావుల్లో పూడిక తీస్తున్నారు. 


కాడి ఎత్తేసిన సర్కారు..!
వేసవి నీటి ప్రణాళికపై చాలా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. ఎండాకాలం మొదలైన తర్వాత సమీక్ష  నిర్వహించింది. పంటలకు నీరు ఇస్తామంటూ ఒక షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నీళ్లివ్వలేమని చేతులెత్తేశారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయని.. రైతులు అనవసరంగా బోర్లు వేయొద్దని చెప్పారు. ప్రభుత్వం నీళ్లిచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి పంటలు వేయొద్దని.. వరి పొట్టదశకు వచ్చిన సమయంలో చెప్పారు. దీన్ని బట్టి ప్రభుత్వం రైతులపై, వ్యవసాయంపై ఎంత చిత్తశుద్ధితో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 


రోడ్డెక్కిన అన్నదాతలు..
నల్గొండ నియోజకవర్గంలో సాగు నీటి కోసం అన్నదాతలు  రోడ్డెక్కారు. ఉదయ సముద్రం ఎస్ఎల్ బీసీ కింద పారుగంత ఉన్న మామిడాల, పజ్జుర్, ఇండ్లుర్, గోరెంకల పల్లి, మండలాపురం గ్రామాల్లో గత 20 రోజులుగా సాగు నీరు అందక పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఎస్ఎల్ బీసీ కింద, D -40, L-11 తూముల ద్వారా తమకు సాగు నీళ్లు వచ్చేవని, కానీ ఇరిగేషన్ అధికారులు తమకు నీళ్లు ఇవ్వకుండా తూములకు సీల్ వేశారని ఆరోపించారు. తూముల సీల్ తొలగించి తమ పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


కాంగ్రెస్ వచ్చి ఆగం చేసింది : ఐలయ్య, హన్మాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా

రెండున్నర ఎకరాల్లో వరి వేశాము. ఇప్పుడు మొత్తం పోయింది. కౌలుకు చేసింది కూడా చేతికి రాకుండా పోయింది. పశువులు తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కాలం మంచిగైంది. కాంగ్రెస్ వచ్చి మొత్తం ఆగం చేసింది. రైతుబంధు ఇయ్యక అట్ల ముంచింది. ఇప్పుడు నీళ్లియ్యక ఇట్ల ముంచుతున్నది. 


ఎమ్మెల్యే మాట నమ్మి నిండా మునిగిన : ఏనుగు లింగారెడ్డి, హన్మాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా..

యాసంగి పంటలకు నీళ్లు ఇస్తామని ఎమ్మెల్యే మాట ఇచ్చారు. ఆయన మాట నమ్మి వరి వేశాను. కాల్వల్లో నీళ్లు రావడం లేదు. బోరు వేస్తే అందులోనూ నీళ్లు పడలేదు. రెండు ఎకరాల పొలం ఎండిపోయింది. ఎమ్మెల్యే మాట నమ్మి నిండా మునిగాను. 

ఇట్లైతే మేం ఎట్ల బత్కాలే :   మైసయ్య, వడపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా
ఇంత నీటి ఎద్దటి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంది. ఊరిలో కూడా వారానికి ఒకసారి నీళ్లు ఇస్తున్నారు. ఇలాగైతే పంటలు ఎలా బతుకుతాయి.? మేమెలా బతుకుతాము.?

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress former telangana

Related Articles