ఉప ఎన్నికలు తథ్యం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు
10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం
కడియం శ్రీహరి ఓడిపోతాడు, రాజయ్య గెలుస్తాడు
సుప్రీంలో విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గులాబీ కండువా కప్పుకున్న స్టేషన్ ఘన్ పూర్ నేతలు
ఎర్రవల్లి నివాసంలో కార్యకర్తలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా స్థానాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమంటూ ఆయన తేల్చి చెప్పడం ఆసక్తిరేకెత్తిస్తోంది. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారంటూ ఆయన కుండబద్ధలు కొట్టడం.. సుప్రీం కోర్టులో రానున్న తీర్పును ఊహించేనన్న చర్చజరుగుతోంది. మరోవైపు గులాబీ బాస్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఉపఎన్నికల్లో నమ్మకద్రోహులకు గుణపాఠం నేర్పుతామని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణం, ఎర్రవెల్లి (ఫిబ్రవరి 11): పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితర నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో కూడా ఉప ఎన్నిక వస్తుందని, కడియం శ్రీహరి ఓటమి ఖాయమన్నారు. మళ్లీ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని జోస్యం చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విచారణ ఓ కొలిక్కి రానుందన్న చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే కేసీఆర్ ఉపఎన్నికలపై వ్యాఖ్యానించడం రాజకీయంగానూ హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తాత్సారం చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. వారిపై చర్యలు తీసుకోవడానికి పది నెలల సమయం పట్టడాన్ని తప్పుబడుతూనే త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. రీజనబుల్ టైమ్ అంటూ సాగదీత ధోరణితో వ్యవహరించడాన్ని ప్రశ్నించింది. ఒకవేళ స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి నిర్ణయం రాని పక్షంలో తామే ఓ టైమ్‌ను ఫిక్స్ చేస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ పరిణామాలు పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చిస్తూ.. దీన్నుంచి బయటపడేదెలా అన్న చర్చల్లో మునిగితేలుతున్నారు.