భయపడ్డ రాహుల్
పర్యటన రద్దు..! t
రైతులు తిరగబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్..!
వరంగల్ టూర్ చివరి నిమిషంలో రద్దు
పార్లమెంట్ సమావేశాలే కారణమన్న కాంగ్రెస్
వరంగల్‌లో రైతు డిక్లరేషన్ చేసిన రాహుల్
డిక్లరేషన్‌ను సక్రమంగా అమలు చేయలేకపోతున్న సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతాంగం
రాహుల్ వరంగల్ టూర్ సేఫ్ కాదన్న ఇంటెలిజన్స్
రైతుల నుంచి నిరసనలు తప్పవని హెచ్చరిక
టూర్ రద్దు చేసుకున్న కాంగ్రెస్ అగ్రనేత
రేవంత్ హామీలు.. కాంగ్రెస్ అగ్రనేతలకు తలనొప్పిగా మారాయా? కనీసం తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోనివ్వకుండా చేస్తున్నాయా? ఏడాది పాలన తర్వాత ఒక్కసారి కూడా గాంధీలు తెలంగాణకు వచ్చింది లేదు. తాజాగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అవ్వడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుందోనన్న టెన్షన్‌తోనే రాహుల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంటెలిజన్స్ వర్గాల పక్కా సమాచారంతో టూర్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తుంది. బయటకు భద్రతా కారణాలని చెప్పినా.. ప్రజల్లో తిరుగుబాటు సుస్పష్టంగా కనబడడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినపడుతున్నాయి.
తెలంగాణం, హైదరాబాద్ (ఫిబ్రవరి 11) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు వెనక ఇంటెలిజన్స్ వర్గాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్ సడన్‌గా తన పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ వచ్చి.. ఆ తర్వాత వరంగల్ వెళతారని, అక్కడి నుంచి ట్రెయిన్‌లో చెన్నై వెళతారని అధికారిక షెడ్యూల్‌ను కాంగ్రెస్ వర్గాలు రిలీజ్ చేశాయి. ట్రెయిన్ ప్రయాణంలో సాధారణ ప్రయాణికులతో మమేకం అవుతారని, వారితో చర్చిస్తారన్నది ఆ వర్గాల సమాచారం. దీంతో అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏర్పాట్లు చేశాయి. రాహుల్ వస్తున్నారన్న వార్తలతో కాంగ్రెస్ వర్గాలు హడావుడి చేశాయి. అయితే చివరి నిమిషంలో రాహుల్ టూర్ రద్దయింది. పార్లమెంట్‌లో కీలక బిల్లులపై చర్చలో పాల్గొనాల్సి ఉన్నందున తెలంగాణ టూర్‌ను రద్దు చేసకున్నారని కొందరు, భద్రతా ఏర్పాట్లు ఓ కారణమని మరికొందరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే అసలు కథ వేరే ఉందని తెలుస్తుంది.
గాంధీల కుటుంబాన్ని చూసే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్న దాంట్లో మరో ముచ్చట లేదు. ఆ పార్టీ గ్యారంటీలపై అగ్రనేతలు ఒక్కొక్కరుగా వచ్చి.. మాట ఇచ్చి.. తామున్నామంటూ ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చారు కాబట్టే ఓట్లు వేశారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆ హామీల అమలులో రాష్ట్రంలో ఉన్న రేవంత్ సర్కార్ ఫెయిల్ అయ్యింది. రైతులు, మహిళలు, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందన్న విమర్శలను మూటగట్టుకుంది. ముఖ్యంగా వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్‌తో మభ్యపెట్టిందన్న ఆగ్రహం రైతుల్లో కట్టలు తెంచుకుంటుంది. రుణమాఫీ, రైతుభరోసా, బోనస్ .. అన్నింటా మోసం చేసిందని మండిపడుతున్నారు. 2022లో మే 6న హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాడు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీని ఆహ్వానించింది. ఈ సభా వేదికగానే రైతు సంక్షేమం కోసం తామేం చేస్తామో చెబుతూ రైతు డిక్లరేషన్‌ను రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు రైతుభరోసా, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. నాడు రాహుల్ చెప్పిన మాటలను నమ్మే రైతులు ఓట్లేశారు. అయితే అధికారం చేపట్టాక హామీలకు కోతలు పెడుతూ, అసంపూర్తిగా హామీలను నెరవేరుస్తూ రైతుల్లో ఆందోళనలకు కారణమైంది.
వందరోజుల్లో హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చి.. ఏడాది పూర్తి అయినా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఒకే సారి రూ.2లక్షల రుణమాఫీ అన్న కాంగ్రెస్ ఇప్పటికీ 100 శాతం చేయలేకపోయింది. రైతుభరోసాను కూడా అంతంత మాత్రంగానే చేసింది. ఎకరాకు ఏడాదికి రూ.15వేలు చేస్తామని చెప్పి నేడు రూ.12వేలు మాత్రమే ఇస్తోంది. అదీను మొదటి రెండు విడతలను ఎగ్గొట్టడం గమనార్హం. ఇప్పటికే ఒక్కో రైతుకు రూ.17,500 బాకీ పడిన సర్కార్ అంటూ ఊరూవాడా పోస్టర్లు కూడా వెలిసిన విషయం తెలిసిందే. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామన్న కాంగ్రెస్ ఆ ఊసే ఎత్తడం లేదు. రైతులంతా ఎంతో ఆశపడి ఓట్లు వేస్తే వారికి పంగనామాలు పెట్టిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతోనే రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయ్యిందన్న చర్చ జరుగుతోంది. వరంగల్ డిక్లరేషన్ సభకు ఆయన స్వయంగా రావడం, రైతులకు మాట ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన టూర్‌కు వస్తే రైతుల నుంచి ఆయనకు నిరసనలు తప్పవన్న ఇంటెలిజన్స్ హెచ్చరికలతోనే సర్కార్ ముందు జాగ్రత్త చర్యగా టూర్‌ను క్యాన్సిల్ చేయించిందన్న చర్చ నడుస్తోంది. భద్రతా కారణాలని చెబుతున్నా అసలు విషయం ఇదేనని తెలుస్తుంది. డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో వరంగల్ రావడం అంత మంచిది కాదని చెప్పడంతో టూర్ అకస్మాత్తుగా రద్దయ్యిందని అంటున్నారు.