హైదరాబాదా ? దోమలాబాదా ?


Published Feb 17, 2025 11:32:42 AM
postImages/2025-02-17/1739772162_WhatsAppImage20250217at11.07.57AM.jpeg

హైదరాబాదా ? దోమలాబాదా ? 
సిటీలో విపరీతంగా పెరిగిపోయిన దోమలు 
నిద్రలేని రాత్రులు గడుపుతున్న నగరవాసులు
పురపాలక శాఖలో పడకేసిన పాలన
తీవ్ర నిర్లక్ష్యం, ఫిర్యాదులపై అలసత్వం
ఒకపక్క దోమల బెడద.. 
మరోపక్క అంతంత మాత్రంగా పారిశుధ్యం!
స్వయంగా ముఖ్యమంత్రే పురపాలక శాఖకు హెడ్
సమీక్షలతో కాలం గడిపేస్తున్న రేవంత్ 
పూర్తిస్థాయిలో నియంత్రణ కరువు
మౌలిక వసతులపై పైపై చర్చలన్న విమర్శలు

 రాష్ట్రంలో పురపాలక శాఖపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నందుకు థాంక్స్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 129 మునిసిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రంలో ఆ శాఖ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చేతిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా.. సరైన సమీక్ష లేక పురపాలికలు అస్తవ్యస్తంగా మారాయని, పాలన పడకేసిందని పలువురు మండిపడుతున్నారు. సీఎం దగ్గర పురపాలక శాఖ ఉంటే, పాలన పరుగులు పెడుతుందనుకుంటే నత్తనడకన సాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది. ఒకపక్క రోజుకో కొత్తరోగం బెంబేలెత్తిస్తుంటే, మరోపక్క పురపాలక శాఖ నిర్లక్ష్యమేంటని ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 16) : పురపాలక శాఖ పడకేసింది. సమస్యలపై ఫిర్యాదులు తీసుకునే వాళ్లు కరువయ్యారు. ఆర్జీలు పెట్టుకున్నా.. ఆ చూస్తాం అంటూ దాటవేసేవారే కానీ, పూర్తిస్థాయిలో దృష్టిపెట్టేవారు లేరు. పాలనలో నిర్లక్ష్య ధోరణితో అధికారయంత్రాంగం విమర్శలపాలవుతోంది. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ మున్సిపల్ శాఖలోని అధికారుల అలసత్వం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి స్వయంగా మున్సిపల్ శాఖకు హెడ్‌గా ఉన్నా.. కార్యాచరణ శూన్యమన్న విమర్శలున్నాయి. ఫ్లైఓవర్ల స్తంభాలకు రంగులు వేస్తే సరిపోదని, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని, చెరువుల పరిరక్షణ పేరుతో కూల్చివేతలు కాదని, ఉన్న చెరువుల పరిశుభ్రత ముఖ్యమని సామాన్యుడు సూచిస్తున్నాడు. 

జీహెచ్ఎంసీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దోమలబెడద, పారిశుధ్య పనుల్లో జాప్యంతో నగరవాసులు విసిగి వేసారిపోతున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకునే నాథుడు కరువయ్యాడని మండిపడుతున్నారు. దోమలతో తాము పడుతున్న ఇబ్బందులను గురించి, పరిస్థితికి అద్దంపట్టేలా ఓ నెటిజన్ సెటైరికల్‌గా విమర్శించారు. దోమలాపూర్, దోమలాబాద్, దోమలనగర్, దోమలబౌలి, దోమలహిల్స్, దోమలపేట, దోమలకొండ, దోమలపల్లి.. ఇలా ఊళ్ల పేర్లకు దోమలను కలిపి విమర్శనాత్మకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమకు నిద్రలేని రాత్రులను మిగిల్చినందుకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, సిబ్బందికి థాంక్స్ చెప్పడం విశేషం. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖ పనితీరుపై పులువురు పెదవి విరుస్తన్నారు. ఇటీవలే సమీక్ష నిర్వహించిన సీఏం, మౌలికవసతుల కల్పన గురించి మాటలతో సరిపెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు పన్ను వసూళ్లు తప్ప, నగరవాసులకు అదనంగా లభించేది ఏం లేదని మండిపడుతున్నారు. ఉన్న సిబ్బందితో సర్వేలు చేయించుకోవడం, విజయోత్సవాలు జరిపించడం తప్ప.. ప్రజాసమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న చర్చ జరుగుతోంది. ఇతర కార్యక్రమాలకు సిబ్బందిని వినియోగించుకోవడం వల్ల అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్నది. రోజుకో పని అప్పగించడం వల్ల సాధారణ విధులకు ఆటంకం కలుగుతుందని, పనులు ఆలస్యం అయితే మళ్లీ తమనే బలిచేస్తారని మున్సిపల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy hyderabad telanganam ghmc

Related Articles