ఐపీఎస్ లు..
సివిల్ సెటిల్మెంట్లు చేస్తుర్రు
IASలు ఏసీ రూముల వదిలివస్తలేరు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్ నుండే
డ్రెస్ వేసుకొని సివిల్ సెటిల్మెంట్ చేస్తున్నారు
ఐఏఎస్ అధికారులు ఏసీ రూం వదిలి
ఫీల్డ్ మీదకు వెళ్లి పని చేయట్లేదు.. వారికి ఏసీ జబ్బు పట్టినట్లుంది
కలెక్టర్లు బయటకు రావడం లేదు!
‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో సీఎం
తెలంగాణం, హైదరాబాద్ (ఫిబ్రవరి 16): బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. గోపాలకృష్ణ అనుభవాలను పుస్తక రూపంలో నిక్షిప్తం చేయడం సంతోషమని అన్నారు. సివిల్ సర్వెంట్స్ అందరికీ ఈ పుస్తకం దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్.. ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తు చేసుకోవాలని అన్నారు. వారి అనుభవాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారని అన్నారు. గతంలో అధికారులు, రాజకీయ నాయకులు అంశాలను ప్రస్తావిస్తే అందులోని లోతుపాతులు, లాభ నష్టాలను వివరించేవారని తెలిపారు. కానీ ఈ రోజుల్లో ఎందుకో అది తగ్గిపోయిందని వెల్లడించారు. ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచే బయటకు రావడం లేదని, జనంలోకి రండి అంటే రావడం లేదని అన్నారు. ట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్ నుండే డ్రెస్ వేసుకొని సివిల్ సెటిల్మెంట్ చేస్తున్నారన్నారు. ఐఏఎస్ అధికారులు ఏసీ రూం వదిలి ఫీల్డ్ మీదకు వెళ్లి పని చేయట్లేదని.. వారికి ఏసీ జబ్బు పట్టినట్లుందన్నారు. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలన్నారు. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని.. అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువ కాలం గుర్తుంటారని తెలిపారు. ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నానని తెలిపారు.