అడ్డగోలుగా సాగర్ నీళ్లు తరలింపు
చోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్
త్రీమెన్ కమిటీ ఎక్కడ ఉంది?
ఏపీని అడ్డుకోకపోతే సాగు, తాగు నీటి సమస్యలు
గాలిమోటర్‌లో ఢిల్లీకి ముఖ్యమంత్రి ట్రిప్పులు..
అన్నదాతల గోస ఆయనకు ఏం తెలుసు?
సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్, హరీశ్
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 16): ఏపీ ఇష్టారాజ్యంగా, యథేచ్చగా కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీలు వినియోగిస్తుందని, సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాలను తరలించిందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ నిలువరించ లేకపోయిందన్నారు. నది జలాలను ఆంధ్రప్రదేశ్ తన్నుకు పోతున్నా బోర్డులో చలనం లేదని, రేవంత్ సర్కార్ నోరెత్తడం లేదని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టును బొట్టును కాపాడుతూ బీడు భూములను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే, ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో, ఒక్కొక్కొటిగా అన్నింటిని కాంగ్రెస్ గంగలో కలుపుతుందన్నారు. వచ్చేది వేసవి అని, తాగునీళ్లకు, సాగు నీళ్లకు కష్టం అని తెలిసి కూడా గాలిమోటర్‌లో ఢిల్లీ ట్రిప్పులు కొడ్తున్న ముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోని త్రీ మెన్ కమిటీ దిక్కులేదని, సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. జాగో రైతన్న జాగో, జాగో తెలంగాణ జాగో అంటూ హెచ్చరించారు.
ఏపీని అడ్డుకోకపోతే..
సాగు, తాగు నీటి సమస్యలు
- మాజీ మంత్రి హరీశ్ రావు
ఏపీ దూకుడు, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వేసవి పూర్తిగా మొదలు కాలేదని, తెలంగాణ రైతులు నీళ్ళ కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని, ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే సాగర్ ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడనుందని హెచ్చరించారు. సాగర్‌లో నీటిమట్టం పడిపోతే హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య సైతం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాలని, ఈమేరకు కృష్ణా బోర్డుపై ఒత్తిడి తేవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోర్డుపై ఒత్తిడి చేయడంలో, నీటి తరలింపు చేయకుండా ఏపీని నిలువరించడంలో తద్వారా తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు.
కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకు పోతుంటే ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందన్నారు. ఈ వాటర్ ఇయర్‌లోనే 646 టీఎంసీలు తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్‌కు పట్టవా అని నిలదీశారు. సాగర్ ఆనకట్ట కేంద్ర బలగల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నదన్నారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నిలువ ఉంచాల్సిన కోటాను ఏపీ తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని విమర్శించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతీ సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగానికి కేఆర్ఎంబీ పరిధిలోని త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ఈ ఏడాది ఇంతవరకు త్రిమెన్ కమిటీ మీటింగ్ పెట్టలేదన్నారు. అంటే బోర్డు వ్యవహారం ఎంతగా దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.