AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్
ITE అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్
శ్రీశైలం గుడి తెలంగాణలో ఉంది
లెప్రసి ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ వచ్చేటోళ్లు
దావోస్ పెట్టిబడులు అంటే లగ్గం పెట్టుకున్నట్టు
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి
దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తప్పుల తడకగా సాగింది. ప్రఖ్యాత సంస్థల పేర్లను తప్పుగా చదువుతూ, ఒప్పందాలు చేసుకున్న సంస్థల పేర్లను మారుస్తూ విమర్శల పాలయ్యారు. కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను పెళ్లి చూపులతో పోల్చడం నవ్వులు పూయించింది. తెలియని విషయాలను తెలుసుకోవాలంటూనే ఆయనే తప్పులు తప్పులుగా సంస్థల పేర్లను చదవడం విమర్శలకు దారితీసింది.
తెలంగాణం, హైదరాబాద్(జనవరి 28): దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయంటూ వాటి పేర్లను చదివి వినిపించారు. ఈ క్రమంలోనే అమెజాన్ వెబ్ సిరీస్, సింగపూర్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమెజాన్ వెబ్ సిరీస్(AWS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్(ITE) రాష్ట్రానికి రావడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. సీఎం వాటిని తప్పుగా చదివారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS)ను కాస్తా ఆయన అమెజాన్ వెబ్ సిరీస్‌గా చదివారు. అంతేగాక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ITE)ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌గా చదివి నవ్వుల పాలయ్యారు.
ఇదిలా ఉంటే, పెట్టుబడులపై ఆయన చేసిన మరో వ్యాఖ్య కూడా నవ్వులు పూయించింది. కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని పెళ్లి చూపులు, లగ్న పత్రికతో పోల్చారు. ‘‘పెళ్లి చూపులు అయిపోయాయ్.. లగ్న పత్రిక రాసుకున్నాం. ఇగ మిగతా కార్యక్రమాలు అన్ని ముందున్నాయి. వాళ్లు మేము లగ్న పత్రిక రాసుకున్నాం’’ అని అన్నారు. దీంతో అక్కడున్న రిపోర్టర్లు గొల్లున నవ్వారు. అయితే తెలియని విషయాలను తెలుసుకోవడం, మానవుడి పరిజ్ఞానం పెంచుకోవడమనేది మినిమమ్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. అలాగే పదం బాగుంది కదా అని, దాన్ని వాడేసి, ఆ తర్వాత దాని అర్థం ఏంటో తెలుసుకుని అర్రే ఇట్లా అనకుండా ఉంటే బాగుణ్ణు అనుకోవడం కూడా పిచ్చితనం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపైనే తాను జోకులు వేసుకుంటున్నారా సీఎం అన్న చర్చ జరుగుతుంది.
రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయని చెప్పుకుంటూ శ్రీశైలం ఆలయం కూడా ఉందని చెప్పారు. అంతేగాక లెప్రసి ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ వచ్చేటోళ్లని తప్పుడు సమాచారం ఇచ్చారు. అప్పట్లో వికారబాద్‌కు టీబీ చికిత్స కోసం వచ్చేవాళ్లు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర భౌగోళిక స్వరూపం కూడా ఆయనకు తెలియదనే విమర్శలు వెల్లువెత్తాయి.
పెట్టుబడులపై అపోహలు సృష్టిస్తున్నారు
ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్న కారణంగా ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకంతో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణతో పాటు ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముందుకొచ్చిన సంస్థలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సింగపూర్‌తో పాటు దావోస్ వేదికగా పెట్టుబడులకు సంబంధించి కుదిరిన ఒప్పందాలను ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియాకు వివరించారు. ఓపెన్ యాక్సెస్ విధానంతో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఎనర్జీ పాలసీతో పెట్టబడులను ఆకర్షించగలిగామని, డేటా సెంటర్లకు సంబంధించిన వాటిల్లోనే లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకొచ్చాయన్నారు. సాధారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల పెట్టుబడులతో ముందుకొచ్చారని తెలిపారు. దాదాపు లక్షా 80 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల కాలంలో ఇప్పటివరకు సాధించిన విజయాల్లో ఈ పెట్టుబడుల సాధన విజయమే అత్యంత కీలకమైందన్నారు. కొందరు తెలంగాణ ప్రభుత్వం మీద, హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ విషప్రచారం చేస్తున్నారన్నారు. తద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని, రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలను కుట్రలు పన్నారన్నారు. ఆయా కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ప్రకటించడంతో వారి కుట్రలు విఫలమయ్యాయన్నారు. దావోస్ పర్యటనే కాకుండా సింగపూర్ ప్రభుత్వంతో కూడా స్కిల్స్ డెవలప్మెంట్లో ఒప్పందం చేసుకున్నామని, అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని తెలిపారు. అమెజాన్, సన్ పెట్రోకెమికల్స్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్... ఇలా అనేక ప్రముఖ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటే కొందరు లేకితనంతో అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. ఆయా కంపెనీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నప్పుడు స్వాగతించడానికి ఇష్టం లేనివారు మౌనంగా ఉండండని, ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామో జాబితా, ఫోటోలు అన్నీ బహిరంగంగానే ఉన్నాయన్నారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్న వారు చెబుతున్నది నిజమా.? ప్రభుత్వం చెబుతున్నది నిజమా పరిశీలించుకోవచ్చన్నారు.
పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన చోట భూ కేటాయింపులు గానీ, పరిపాలన అనుమతులు ఇవ్వడం ద్వారా గానీ ఆ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే కాలంలో తెలంగాణ సమాజానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందివ్వాలన్న ఆలోచన ప్రభుత్వానిదని, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భవిష్యత్తులో అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారాలి. వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి తీసుకెళ్లాలని నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.